
కాదేదీ సినిమాకు అనర్హం అన్నట్లుగా ప్రపంచంలో, సమాజంలో ఉన్న ప్రతీది ఓ కథా వస్తువే! కల్పితాలతో పాటు రియల్ స్టోరీలను కూడా వెండితెరపై చూపిస్తూ ఉంటారు. అలా దేశాన్ని సరిహద్దులో ఉండి కాపాడుతున్న సైనికుల పోరాటాలు, జీవన విధానాలు తెరపై ఎన్నోసార్లు ఆవిష్కృతమై బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించాయి. అయితే సినిమాలోనే కాకుండా నిజ జీవితంలోనూ కొందరు సైనికులుగా సేవ చేస్తే మరికొందరు సెలబ్రిటీలకేమో మిలిటరీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. నేడు (ఆగస్టు 15) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినీ ఇండస్ట్రీలో మిలటరీ నేపథ్యం ఉన్న తారలెవరో ఓసారి చూసేద్దాం..
రకుల్, అనుష్క పేరెంట్స్..
రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి రాజేంద్ర సింగ్ ఆర్మీ అధికారి. అక్షయ్ కుమార్ (Akshya Kumar) తండ్రి హరి ఓం భాటియా విశ్రాంత ఆర్మీ అధికారి. అనుష్క శర్మ తండ్రి కల్నల్ అజయ్ కుమార్ శర్మ కార్గిల్ యుద్ధంలోనూ భాగమయ్యారు. అనుష్క విద్యాభ్యాసమంతా బెంగళూరులోని ఆర్మీ స్కూల్‌లోనే జరిగింది. ప్రియాంక చోప్రా తల్లిదండ్రులు మధు - అశోక్ చోప్రా ఇండియన్ ఆర్మీలో వైద్యులుగా సేవలందించారు. నటి లారా దత్తా తండ్రి ఎల్‌కే దత్తా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్‌గా పని చేశారు.
ఉగ్రదాడిలో వీరమరణం
సుష్మితా సేన్ తండ్రి శుభీర్ సేన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో వింగ్ కమాండర్‌గా సేవలందించారు. నిమ్రత్ కౌర్ తండ్రి, ఆర్మీ అధికారి మజోర్ భూపిందర్ సింగ్.. 1994లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందారు. ప్రీతి జింటా తండ్రి దుర్గానంద్ కూడా ఓ జవానే! తెలుగు నటి గాయత్రి గుప్తా తాతయ్య సైతం ఆర్మీలో పని చేశాడు. బ్రిటీష్ వారి చేతిలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు.
దిశా పటానీ సోదరి కూడా..
నేహా ధూపియా తండ్రి ప్రదీప్ సింగ్ ఇండియన్ నేవీలో కమాండర్‌గా పని చేశారు. మానుషి చిల్లర్ తండ్రి మిత్ర బసు చిల్లర్ డీఆర్‌డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్)లో ఫిజీషియన్‌గా పని చేశారు. గుల్ పనగ్ తండ్రి లెఫ్టినెంట్ జనరల్ పనగ్.. మిలిటరీలో అందించిన సేవలకుగానూ పరమ విశిష్ట్ సేవా పురస్కారం అందుకున్నారు. దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ ఇండియన్ ఆర్మీలో మేజర్‌గా సేవలందిస్తున్నారు.