మలయాళ బ్యూటీ హనీరోజ్ (Honey Rose) ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా తను ప్రధాన పాత్రలో నటించిన రాహెల్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఎమోషనల్ కామెంట్స్ చేసింది. హనీరోజ్ మాట్లాడుతూ.. మలయాళ సినిమాకు నా అవసరం ఉందా? అని నన్ను అడిగితే లేదనే చెప్తాను. నేనే ఈ ఇండస్ట్రీకి గట్టిగా అతుక్కుపోయాను.
వేలు పట్టుకుని నడిపించారు
నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలవుతోంది. దర్శకుడు వినాయన్ సర్ మొదటి నుంచి నా చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. ఈ సినిమాతో నా కెరీర్ టర్న్ అవుతుందని ఆయన భావిస్తున్నారనుకుంటా! నాకు బోలెడన్ని అవకాశాలు రావాలి.. వచ్చిన సినిమాలన్నీ చేసుకుంటూ పోవాలని నేనెప్పుడూ అనుకోలేదు. వచ్చినవాటిలో ఉత్తమమైన వాటినే ఎంపిక చేసుకుంటాను. వాటికోసమే కష్టపడతాను. సినిమా అంటే నాకు అంత పిచ్చి అని హనీరోజ్ చెప్పుకొచ్చింది.
ఊహించినదానికన్నా అద్భుతంగా..
వినాయన్ మాట్లాడుతూ.. మలయాళంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ల కంటే కూడా హనీరోజ్ ఎక్కువ సంపాదిస్తుంది. ఆమెకు ఈవెంట్లు, ప్రోగ్రామ్‌ల ద్వారా మంచి ఆదాయం వస్తుంది. కానీ, తనకు డబ్బు కన్నా సినిమా అంటేనే ఎక్కువ ఇష్టం. రాహేల్‌లో హనీ.. నేను ఊహించినదానికన్నా అద్భుతంగా నటించింది అని చెప్పుకొచ్చాడు. ఈమె తెలుగులో ఆలయం, ఈ వర్షం సాక్షిగా, వీర సింహా రెడ్డి చిత్రాల్లో నటించింది.
చదవండి: రాహేలు ట్రైలర్ చూశారా?


