ఈ వారం తెలుగులో చాలా సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో రష్మిక 'ద గర్ల్‌ఫ్రెండ్' మాత్రమే ఉన్నంతలో బజ్ క్రియేట్ చేసింది. అందుకు తగ్గట్లే పాజిటివ్ టాక్ కూడా దక్కించుకుంది. మరి తొలిరోజు దీనితో పాటు రిలీజైన సినిమాల సంగతేంటి? కలెక్షన్స్ ఎంత వచ్చాయని టాక్ వినిపిస్తుంది? ఇంతకీ వీటిలో ఏయే సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందనేది ఇప్పుడు చూద్దాం.
రష్మిక 'ద గర్ల్‌ఫ్రెండ్' విషయానికొస్తే.. విడుదలకు ముందురోజే ప్రీమియర్స్ వేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తొలిరోజు వసూళ్లు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. అలా దేశవ్యాప్తంగా తొలిరోజు రూ.1.30 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. చిత్రబృందం మాత్రం తొలిరోజు కంటే రెండో రోజు వచ్చేసరికి నాలుగురెట్ల వసూళ్ల పెరిగినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికైతే అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేయలేదు. బహుశా వీకెండ్ తర్వాత చేస్తారేమో చూడాలి.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9లో సెల్ఫ్ ఎలిమినేషన్.. అలానే మరొకరు!)
మహేశ్‌బాబు బావమరిది సుధీర్‌బాబు లేటెస్ట్ మూవీ 'జటాధర'. హీరోతో పాటు కొందరు మాత్రమే తెలుగు నటీనటులు ఉన్నారు. ప్రస్తుతం ట్రెండింగ్ సబ్జెక్ట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ అయినప్పటికీ.. స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా మరీ తీసికట్టుగా ఉండటంతో నెగిటివ్ టాక్ వచ్చింది. తెలుగుతో పాటు హిందీలోనూ దీన్ని రిలీజ్ చేశారు. అయినప్పటికీ తొలిరోజు రూ.1.47 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. వీకెండ్ అయ్యేసరికి కనీస వసూళ్లయినా వస్తాయా అనేది చూడాలి.
వీటితో పాటు తిరువీర్ హీరోగా నటించిన 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ లక్షల్లో మాత్రమే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది కాకుండా ప్రేమిస్తున్నా అనే తెలుగు మూవీ కూడా థియేటర్లలోకి వచ్చింది. బాగానే ఉందని అంటున్నారు. ఇదొకటి వచ్చిన విషయం కూడా జనాలకు పెద్దగా తెలీదు. కాబట్టి దీనికి కూడా చాలా తక్కువ వసూళ్లు వచ్చుంటాయి. ఇవి కాకుండా 'ఆర్యన్', 'డీయస్ ఈరే' అనే డబ్బింగ్ చిత్రాలు కూడా తెలుగులో విడుదలయ్యాయి. కానీ వీటికి చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చినట్లు కనిపించట్లేదు. ఓవరాల్‌గా చూసుకుంటే రష్మిక సినిమా మాత్రమే ప్రస్తుతానికి లీడ్‌లో ఉంది.
(ఇదీ చదవండి: సౌండ్‌తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ)



