‘అయోధ్య రామయ్య, చెప్పాలని ఉంది, జోరుగా హుషారుగా..’ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేశ్‌చంద్ర తెరకెక్కించిన కొత్త చిత్రానికి ‘పిఠాపురంలో..’ అనే టైటిల్ ఖరారైంది. ‘అలా మొదలైంది’ అన్నది ఉపశీర్షిక. సన్నీ అఖిల్, రెహానా, డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ ప్రధానపాత్రల్లో నటించారు.

దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్‌ఎం మురళి (గోదారి కిట్టయ్య) నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మహేశ్ చంద్ర మాట్లాడుతూ– ‘‘కుటుంబ భావోద్వేగాలు కలగలిసిన ప్రేమకథా చిత్రమిది. ఈ చిత్రంలో మూడు జంటల ప్రేమకథలను, ముగ్గురు తండ్రుల పెంపకాల్లోని లోటు΄ాట్లని చూడొచ్చు. కథను నమ్మి, ఈ సినిమా తీశాం. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు.


