
ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతలు, ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్ చర్చలు ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. ఇవాళ జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో సినీ వర్కర్స్ సమ్మె యథావిధిగా కొనసాగనుంది. నిర్మాతలు, ఫెడరేషన్ మధ్య కొన్ని ప్రతిపాదనలపై సయోధ్యం కుదరలేదని తెలుస్తోంది. దీంతో మరోసారి భేటీ కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ సమావేశానికి నిర్మాత దిల్ రాజు కూడా హాజరై మాట్లాడారు.
ఈ చర్చలపై దిల్ రాజు మాట్లాడుతూ... ఫిల్మ్ ఛాంబర్లో ఫెడరేషన్ , నిర్మాతల మధ్య మీటింగ్ జరిగింది. వేతనాల పెంపు, నిర్మాతల వైపు నుంచి రెండు వర్కింగ్ కండీషన్స్పై ప్రధానంగా చర్చ జరిగింది. ఆ షరతులకు ఒప్పుకుంటేనే వేతనాలను పెంచుదామని నిర్మాతలు చెప్పారు. మరోసారి చర్చలు జరుగుతాయి. ఎందుకంటే ఇద్దరినీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. రూ.2 వేల కన్నా తక్కువ వేతనం తీసుకునే వారికి ఒక పర్సంటేజీ ఆఫర్ చేస్తున్నాం. దాని కన్నా ఎక్కువ వేతనం తీసుకునే వాళ్లకు మరొక పర్సంటేజీ ఇవ్వాలని ప్రతిపాదించాం. ఫెడరేషన్‌లోని అన్ని యూనియన్‌లతో మాట్లాడుకుని వస్తే సమస్య పరిష్కరిస్తాం' అని అన్నారు.
రేపటి నుంచి చర్చలు కూడా కొనసాగుతాయని నిర్మాత సి కల్యాణ్ తెలిపారు. రేపు, ఎల్లుండి కూడా మీటింగ్స్ జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు. డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ ఈ మూడు యూనియన్లకు పర్సంటేజ్ పెంచలేమని అన్నారు. సమ్మె కొనసాగించెందుకు నిర్మాతలు సైతం సిద్దమేనని ఆయన ప్రకటించారు.