
గత రెండు మూడు రోజుల నుంచి దీపిక పదుకొణె తెగ వైరల్ అవుతోంది. దీనికి కారణం సందీప్ రెడ్డి వంగా. ఈ దర్శకుడు.. ప్రభాస్ హీరోగా 'స్పిరిట్' అనే సినిమా తీస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా తొలుత దీపికనే అనుకోని, చివరి నిమిషంలో తృప్తి దిమ్రిని తీసుకున్నారనే టాక్ నడుస్తోంది. అయితే తన సినిమా స్టోరీని లీక్ చేస్తుందని సందీప్ ఓ ట్వీట్ చేశాడు. డర్టీ పీఆర్ గేమ్స్ అని రెచ్చిపోయాడు. ఇదంతా కూడా దీపికని ఉద్దేశించే అనే కామెంట్స్ వినిపించాయి.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బ్లాక్ బస్టర్ 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ)
తాజాగా ఓ ఫ్యాషన్ షోలోపాల్గొన్న దీపిక పదుకొణె, మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'జీవితంలో బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలంటే నిజాయతీ ముఖ్యం. నేను దానికే ప్రాధాన్యం ఇస్తాను. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నా మనసు చెప్పిందే వింటాను. తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాను. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాను' అని చెప్పుకొచ్చింది.
అయితే దీపిక పరోక్షంగా సందీప్ వంగాకు కౌంటర్ ఇచ్చేలా మాట్లాడిందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సరే ఈ విషయాలన్నీ పక్కనబెడితే సందీప్ వంగా 'స్పిరిట్' పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు దీపిక.. 'కల్కి 2' కోసం సిద్ధమవుతోంది. కొన్నాళ్ల క్రితం ఈమెకు కూతురు పుట్టింది. చివరగా 'సింగం ఎగైన్'లో దీపిక కనిపించింది. ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులేం ఒప్పుకోలేదు.
(ఇదీ చదవండి: నాగార్జున ఫ్లాప్ సినిమా నచ్చిందంటున్న ధనుష్)