
కొన్నిసార్లు ఏ మాత్రం అంచనాల్లేకుండా విడుదలై అద్భుతాలు సృష్టిస్తుంటాయి కొన్ని చిన్న సినిమాలు. అలాంటి వాటిలో 'టూరిస్ట్ ఫ్యామిలీ' ఒకటి. సూర్య రెట్రో చిత్రానికి పోటీగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. ప్రేక్షకుల నుంచి విశేషాదరణ దక్కించుకుంది. కేవలం తమిళం వరకే రిలీజ్ ఉండటంతో తెలుగు ఆడియెన్స్.. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశారు. ఇప్పుడు వాళ్లకోసమా అన్నట్లు గుడ్ న్యూస్ వచ్చేసింది.
తమిళంలో మే 1న థియేటర్లలోకి వచ్చి సూపర్ హిట్ అయిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా.. జూన్ 2 నుంచి హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఓవర్సీస్ ఆడియెన్స్ కోసం సింప్లీ సౌత్ ఓటీటీలో అదే రోజు నుంచి మూవీ అందుబాటులోకి రానుంది. సాధారణంగా వీకెండ్‌లో కొత్త మూవీస్‌ని ఓటీటీల్లో రిలీజ్ చేస్తుంటారు. కానీ దీన్ని మాత్రం సోమవారం స్ట్రీమింగ్ చేస్తుండటం విశేషమనే చెప్పాలి. ఈ చిత్రం తెలుగులో రిలీజ్ కానప్పటికీ డైరెక్టర్ రాజమౌళి, హీరో నాని లాంటి వాళ్ల మెప్పు పొందింది. స్వయంగా వీళ్లు ట్వీట్స్ కూడా చేయడం విశేషం.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 14 సినిమాలు రిలీజ్)

శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించగా.. అభిషాన్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమా తీశాడు. గతంలో ఇతడు యూట్యూబర్ కావడం ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం. సినిమా చాలా సాదాసీదాగా ఉంటూనే సగటు ప్రేక్షకుడు మనసు గెలుచుకుంది. దీంతో ఈ మూవీకి తెలుగులోనూ ఓటీటీలోకి రాకముందే కాస్త బజ్ ఏర్పడింది. మరి స్ట్రీమింగ్ అయిన తర్వాత మన దగ్గర ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి?
టూరిస్ట్ ఫ్యామిలీ విషయానికొస్తే.. ధర్మదాస్ (శశికుమార్).. అతడి భార్య వాసంతి (సిమ్రాన్), ఇద్దరు కొడుకులతో కలిసి శ్రీలంక నుంచి అక్రమంగా మన దేశానికి వలస వస్తాడు. వీళ్ల గురించి ఎవరికీ తెలియకుండా ధర్మదాస్ బావమరిది మేనేజ్ చేస్తుంటాడు. ఎవరితోనూ మాట్లాడొద్దని, ఏ విషయాలు చెప్పొద్దని దాస్ కుటుంబానికి చెప్పినా.. దానికి భిన్నంగా వాళ్లు ప్రవర్తిస్తారు. దీంతో అనుకోని చిక్కుల్లో పడతారు. మరి చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మోహన్ లాల్ రీసెంట్ హిట్ మూవీ)