ఒక గొప్ప నటుడిని కోల్పోయాం.. కోట మరణంపై ప్రముఖుల సంతాపం | CM Revanth, KCR, KTR, Tollywood Celebrities Condolences Over Kota Srinivasa Rao Death | Sakshi
Sakshi News home page

కోట శ్రీనివాసరావు మృతిపై సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

Jul 13 2025 8:36 AM | Updated on Jul 13 2025 11:10 AM

CM Revanth, KCR, KTR, Tollywood Celebrities Condolences Over Kota Srinivasa Rao Death

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు(83) మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కోట శ్రీనివాసరావు మృతి సినీ రంగానికి తీరని లోటని సీఎం రేవంత్అన్నారు. కోట శ్రీనివాసరావుకు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

విభిన్న పాత్రలను పోషించి, ప్రేక్షక హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్న విలక్షణ వెండితెర నటుడు కోటా శ్రీనివాసరావు .వారి మరణంతో సినీమా రంగం ఒక గొప్ప నటున్ని కోల్పోయింది.స్వర్గస్తులైన కోటా శ్రీనివాసరావు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భవంతున్ని ప్రారిస్తున్నాను.కోట కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రభాగ సానుభూతి తెలియజేస్తున్నాను- తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్అధినేత కేసీఆర్ 

లెజెండరీ యాక్టర్ , బహుముఖ ప్రజ్ఞా శాలి శ్రీ కోట శ్రీనివాస రావు గారు ఇక లేరు అనే వార్త ఎంతో కలచివేసింది. 'ప్రాణం ఖరీదు' చిత్రం తో ఆయన నేను ఒకే సారి సినిమా కెరీర్ ప్రారంభించాము. ఆ తరువాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రని తన విలక్షణ, ప్రత్యేక శైలి తో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు శ్రీ కోట .కామెడీ విలన్, అయినా సీరియస్ విలన్ అయినా, సపోర్టింగ్ క్యారక్టర్ అయినా, ఆయన పోషించిన ప్రతి పాత్ర ఆయన మాత్రమే చేయగలడు అన్నంత గొప్పగా నటించారు. రీసెంట్ గా ఆయన కుటుంబం లో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మానసికంగా ఎంతగానో కుంగదీసింది. శ్రీ కోట శ్రీనివాస రావు లాంటి నటుడు లేని లోటు చిత్ర పరిశ్రమ కి, సినీ ప్రేమికులకి ఎన్నటికీ తీరనిది.ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకి, అభిమానులకి , నా ప్రగాఢ సంతాపం తెలియ చేస్తున్నా- మెగాస్టార్చిరంజీవి

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు సినీ నటులు కోట శ్రీనివాసరావు మరణించారు అన్న వార్త తీవ్రంగా బాధించింది. అనేక సినిమాలలో విలక్షణ నటుడగా, అనేక పాత్రలు పోషించి ప్రజా జీవితంలో శాసనసభ్యుడిగా పని చేసిన వ్యక్తి.వారి మరణం భారతీయ జనతా పార్టీకి వారి అభిమానులకు తీరని లోటు. అనారోగ్యంతో ఉన్న పార్టీ కార్యక్రమాలకు వచ్చేవారు . కోట శ్రీనివాసరావు మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు అభిమానులకు ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం-ఎన్ రాంచందర్ రావు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా, అసాధారణ పాత్రధారిగా తనదైన ముద్ర వేసిన శ్రీ కోట శ్రీనివాసరావు గారి మరణం ఆవేదన కలిగించింది - బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

విలక్షణ నటుడు, మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకుడు కోటా శ్రీనివాస రావు గారు పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. వారు అనేక అంశాలపై లోతైనా అవగాహనా కలిగిన వ్యక్తి వారితో నాకు ఆత్మీయ అనుబంధం ఉంది. సనాతన ధర్మం, సామాజిక విలువలు, భాషా పరిరక్షణ తదితర విషయలపై సమాజంలో మరి ముఖ్యంగా యువతలో చైతన్యం నింపేందుకు ఎంతో కృషి చేశారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో 750కి పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషించి తెలుగు సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును చాటుకున్నారు. 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారువారి సేవలను గుర్తించి 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించుకుంది. వారి మృతి సినీ రంగానికి తెలుగు సమాజానికి తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను- కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

కోట శ్రీనివాసరావు మహా నటుడు రోజుకి 18 , 20 గంటలు పని చేసే వాళ్ళం .అరేయ్ ఒరేయ్ అంటూ పిలుచుకునే వాళ్ళము .కోట లేదని అంటే నమ్మలేకపోతున్నాను. నటన ఉన్నంత వరకు కోట ఉంటారు.- బ్రహ్మానందం

అహనా పెళ్ళంట సినిమా చూడని తెలుగు వారు వుంటారని నేను అనుకోను .నా సినిమా సూపర్ హిట్స్ లో కోట మామ ఉన్నారు. తెలుగు సినిమాలో కోట మామ గారు ప్రత్యేకం .ఆయన మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు .రాజకీయాల్లో కూడా కోట ఉన్నారు. కోట మామ ఎక్కడున్నా స్వర్గంలో కూడా మీరు అలాగే ఉండాలి- నటుడు రాజేంద్రప్రసాద్

ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు గారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రజాసేవతోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరనిలోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను- హీరో నందమూరి బాలకృష్ణ

కోట శ్రీనివాసరావు ఎంతో మంచి వ్యక్తి .తెలుగు లో తన సహా నటులకు అవకాశాలు కోసం ఎంతో పోరాడేవారు. తెలుగు నటి నటులకు అవకాశాలు ఇవ్వాలని నిర్మాతలకు చెప్పేవారు .ఆయన మరణన్ని జీర్ణించుకోలేకపోతున్నాం-నిర్మాత అచ్చిరెడ్డి

చిరస్మరణీయమైన పాత్రల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన కోటా గారి మృతి సినీ లోకానికి, అభిమానులకు తీరని లోటు. కోటా శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను- మాజీ మంత్రి హరీశ్ రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement