స్టార్ హీరో అయిన చిరంజీవి చాన్నాళ్లుగా అదే స్టార్‌డమ్ మెంటైన్ చేస్తున్నారు. అలాంటి ఈయన చేసిన ఓ సినిమా ఏళ్లకు ఏళ్లు రిలీజ్ కాకుండా ఆగిపోయిందంటే ఎవరైనా నమ్ముతారా? కచ్చితంగా నమ్మరు. కానీ 'విశ్వంభర' విషయంలో అదే జరుగుతోంది. ఈ మూవీ గురించి ఎవరూ అడగడం లేదు. చిరు కూడా దీని గురించి ఒక్క మాట మాట్లాడటం లేదు. ప్రేక్షకులు కూడా దీనిని పట్టించుకోవడం మానేశారు!
(ఇదీ చదవండి: హీరో సూర్య ముందు అద్భుతమైన అవకాశం)
ఈ సినిమా గురించి ఇప్పుడెందుకు డిస్కషన్ వచ్చిందంటే? మెగా హీరో వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' సక్సెస్ మీట్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. బాబీ దర్శకత్వంలో తను చేస్తున్న మూవీ టైటిల్ 'కదిరి నరసింహుడు' అన్నట్లు లీక్ చేశారు. దీంతో అందరి అటెన్షన్ దీనిపై పడింది. కానీ కొందరు నెటిజన్లు మాత్రం 'విశ్వంభర' గురించి ఏదో ఒక అప్‌డేట్ ఇస్తే బాగుంటుంది బాసూ అని అడుగుతున్నారు.
కొన్ని నెలల ముందు వరకు 'విశ్వంభర'ని ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేస్తారని రూమర్స్ వినిపించాయి. కట్ చేస్తే వేసవి అయిపోయి వర్షకాలం కూడా వచ్చేసింది. సినిమా జాడ మాత్రం లేదు. ఈ ఏడాదికి సంబంధించి డిసెంబరు వరకు రిలీజ్ డేట్స్ ఖాళీ అయితే లేవు. దసరా, దీపావళికి చాలానే మూవీస్ రెడీగా ఉన్నాయి. మరి 'విశ్వంభర'ని ఈ ఏడాది రిలీజ్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా? లేదంటే ట్రోలింగ్‌కి భయపడి దర్శకనిర్మాత వెనక్కి తగ్గుతున్నారా అనేది ఇక్కడ ప్రశ్న. ఒకవేళ విడుదల చేస్తే అక్టోబరు వైపు ఏమైనా చూస్తారా? లేదా సంక్రాంతికి తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది.
ఏడు లోకలు అనే పీరియాడికల్ ఫాంటసీ కథతో 'విశ్వంభర' తీశారు. రెండేళ్ల క్రితం టీజర్ రిలీజ్ చేయగా దారుణంగా విమర్శలు వచ్చాయి. తర్వాత ఓ పాట వదిలారు గానీ జనాలకు అస్సలు నచ్చలేదు. తర్వాత నుంచి అప్‌డేటే ఇవ్వట్లేదు. ఒకటి రెండు ఇంటర్వ్యూల్లో దర్శకుడు వశిష్ఠని రిలీజ్ గురించి అడిగితే త్వరలో వస్తుందని అన్నాడు తప్పితే పక్కా డేట్ చెప్పలేదు. ఇప్పుడు చిరు కూడా చేస్తున్న మూవీస్ గురించి చెబుతున్నారు గానీ ఇదొకటి ఉందనే సంగతే మర్చిపోయారా అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి కామెడీ సినిమా.. ట్రైలర్ రిలీజ్)


