మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి జరిగాయి. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి బీవీఎస్ రవి, బండ్ల గణేశ్, హైపర్ ఆది, దర్శకులు వశిష్ఠ, బాబీ తదితరులు వచ్చారు. చిరంజీవి గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే 'విశ్వంభర' గురించి టాపిక్ రాగా.. డైరెక్టర్ వశిష్ఠ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'రాసిపెట్టుకోండి బల్లగుద్ది చెబుతున్నాను. 'విశ్వంభర' లేటుగా వచ్చినా బాక్సాఫీస్ బద్దలైపోద్ది' అని దర్శకుడు వశిష్ఠ అన్నాడు. దీంతో కొత్త సందేహాలు మొదలయ్యాయి. ఒకవేళ ఈ ఏడాది రిలీజ్ ప్లాన్ ఉంటే కచ్చితంగా దానికి తగ్గట్లే మాట్లాడేవాడు. లేటుగా వచ్చినా అని అన్నాడంటే ఈ ఏడాది థియేటర్లలోకి రాదా అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.
మూడేళ్ల క్రితం అంటే 2023 ఆగస్టు 22న 'మెగా 156' పేరుతో 'విశ్వంభర' ప్రాజెక్టుని ప్రకటించారు. తర్వాత ఏడాది టీజర్ రిలీజ్ చేశారు. అక్కడి నుంచి సీన్ మొత్తం మారిపోయింది. టీజర్‌లోని గ్రాఫిక్స్ చూసి సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్, విమర్శలు వచ్చాయి. దీంతో విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని పనిచేస్తున్నారని గతంలో వార్తలొచ్చాయి. షూటింగ్ కూడా పూర్తయినట్లు ఎప్పుడో చెప్పారు. ఇదంతా జరిగి చాలా కాలమైపోతున్నప్పటికీ మూవీ రిలీజ్ ఎప్పుడనేది క్లారిటీ రావట్లేదు. చివరకు దర్శకుడు కూడా 'లేటుగా వచ్చినా' అని దాటవేస్తున్నాడు. మరి 'విశ్వంభర'కి ఎప్పుడు మోక్షం లభిస్తుందో?
ఏడు లోకాల కాన్సెప్ట్‌తో తీసిన ఈ సోషియో ఫాంటసీ మూవీలో త్రిష హీరోయిన్ కాగా ఇషా చావ్లా, సురభి, ఆషికా రంగనాథ్ లాంటి హీరోయిన్లు కూడా పలు పాత్రల్లో నటించారు. కీరవాణి సంగీతమందించారు. ఇప్పటికే ఓ పాట రిలీజ్ చేశారు. కానీ అది జనాలకు పెద్దగా నచ్చలేదు. దర్శకుడు వశిష్ఠ మీద కూడా చాలానే విమర్శలు వస్తున్నాయి. దీంతో ఇంటర్వ్యూల్లోనూ ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు బర్త్ డే సెలబ్రేషన్స్‌కి వచ్చి ఈ వ్యాఖ్యలు చేశాడు.


