
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ ఛావా. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఛావా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలో మెప్పించారు.
తాజాగా ఛావా నటుడు వినీత్ కుమార్ సింగ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను త్వరలోనే తండ్రి కాబోతున్నట్లు వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. కాగా.. వినీత్ కుమార్ సింగ్ 2021లో నటి రుచిరాను పెళ్లాడారు.
వినీత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. "ఈ సమయంలో తన భార్య రుచిరాను జాగ్రత్తగా చూసుకోవడానికి నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. వీలైనంత త్వరగా పని ముగించుకుని ఇంటికి వెళ్తా. నా షెడ్యూల్ నేను నిర్ణయించుకున్నా. ఆమెతో పాటు నేను కూడా డాక్టర్ వద్దకు వెళ్తాను. రాబోయే జూలైలో బిడ్డ పుట్టిన తర్వాత పితృత్వ సెలవు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నా'అని పంచుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే వినీత్ కుమార్ సింగ్.. ఛావాతో పాటు ఇటీవల విడుదలైన జాట్ మూవీతోనూ కనిపించారు. అంతకుముందు 'సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలెగావ్', గుంజన్ సక్సేనా, గుస్పాతియా, మ్యాచ్ ఫిక్సింగ్' లాంటి సినిమాలతో పాటు రంగ్‌బాజ్ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించారు.