కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా నటించిన తాజా చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద సాయి రాజేష్, ఎస్ కే ఎన్ నిర్మించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. మంచి అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 24) విడుదలైన ఈ చిత్రానికి ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. సెకండాఫ్‌ని ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేదని పలు న్యూస్ వెబ్‌సైట్లు తమ రివ్యూలో పేర్కొన్నాయి.
అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ సినిమా దూసుకెళ్తోంది. కేవలం కొన్ని చోట్ల మాత్రమే వేసిన ప్రీమియర్ షోకి రూ. 3.13 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక తొలి రోజు మొత్తంగా రూ. 12.3 కోట్లకు పైగా కలెక్షన్స్‌ని సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం.. బరిలో పెద్ద సినిమాలేవి లేకపోవడంతో వీకెండ్‌లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


