జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలపై ఇటీవల వెలుగులోకి వచ్చిన వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. అభిమానుల పేరుతో ఏర్పడిన ‘రా ఎన్టీఆర్’ సంఘం చేసిన చర్యలు హీరోకు అసౌకర్యం కలిగించాయి.
ఈ సంఘం ఊరూవాడ అనే కార్యక్రమం పెట్టారు. వంద కోట్ల రూపాయల ఫండ్ సేకరణ అంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చింది. నిజానికి ఈ సంఘం వారికి నిజంగానే ఎన్టీఆర్ అంటే అభిమానం. అప్పటికే వీళ్లు పలు సేవా కార్యక్రమాలు కూడా చేశారు. తమ హీరోను మరింత ఎలివేట్ చేయాలనుకున్నారు. కానీ అదే సమయంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై లీకులు రావడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఈ పరిణామాలపై ఎన్టీఆర్ స్వయంగా ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ లేఖ తర్వాత ‘రా ఎన్టీఆర్’ సంస్థ ప్రెస్ మీట్ పెట్టింది. ఎన్టీఆర్ కోటరీ చుట్టూ పలు విమర్శలు చేసింది. కలసి మాట్లాడతాం తమకు ఎపాయింట్‌మెంట్ ఇవ్వాలని కూడా కోరింది. కానీ తెరవెనక ఒత్తిడి పెరగడంతో చివరికి సేవా కార్యక్రమాలను నిలిపివేస్తున్నామని ‘రా ఎన్టీఆర్’ సంస్థ స్వయంగా ప్రకటించింది. దీంతో కొంతమంది ఆపన్నులకు అందాల్సిన సాయం ఆగిపోయింది.
ఈ ఘటన ద్వారా ఎన్టీఆర్ అభిమానులకు స్పష్టమైన సందేశం వెళ్లింది. అభిమాన సంఘాలు హీరో పేరుతో చేసే పనులు పరిమితి లోపల ఉండాలి. సేవా కార్యక్రమాల వరకు ఓకే, కానీ.. రాజకీయాలు లేదా పెద్ద ఫండ్ సేకరణలు చేసే ముందు హీరో అనుమతి లేకుండా చేయరాదు.


