
‘‘శేఖర్ కమ్ముల(Sekhar Kammula)తో సినిమా చేయాలని ఉంది. హీరోయిన్లకు ఆయన మంచి పాత్రలు రాస్తారు’’ అన్నట్లుగా ఓ సందర్భంలో సమంత(Samantha) పేర్కొన్నారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. ఇటీవల నాగార్జున–ధనుష్‌లతో ‘కుబేర’ వంటి హిట్ మూవీ ఇచ్చిన శేఖర్ కమ్ముల తదుపరి ఒక ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా చేయాలనుకుంటున్నారని సమాచారం. ఈ చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తారనే టాక్ వినిపిస్తోంది.
ఒక బలమైన అంశం చుట్టూ తిరిగే ఈ చిత్రంలో కథానాయిక పాత్ర చాలా వపర్‌ఫుల్‌గా ఉంటుందట. ఇదిలా ఉంటే నాని హీరోగా శేఖర్ కమ్ముల ఓ సినిమా చేయనున్నారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. ‘‘ఈ సినిమాకి సంబంధించిన చర్చ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయ్యాక ఈ సినిమా గురించిన వివరాలను షేర్ చేస్తాను’’ అని ఆ మధ్య శేఖర్ కమ్ముల స్పష్టం చేశారు.
ఈలోపు సమంతతో ఆయన సినిమా చేయనున్నారనే వార్త తెరపైకి వచ్చింది. మరి... శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నెక్ట్స్ రానున్న సినిమా ఏంటి? అది హీరో ఓరియంటెడ్ మూవీనా? లేక హీరోయిన్ ఓరియంటెడా? ఎవరు నటిస్తారు? అనేది తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడక తప్పదు.