ప్రశాంత్‌కు ఇబ్బందిగా మారిన 'బిగ్‌బాస్‌' ప్రైజ్‌ మనీ.. వాళ్లను మోసం చేశాడా? | Sakshi
Sakshi News home page

రైతులకు ఇచ్చిన మాట తప్పి అమ్మాయిలతో ఎంజాయ్‌.. పల్లవి ప్రశాంత్‌ రియాక్షన్‌

Published Sun, Feb 18 2024 1:10 PM

Bigg Boss Pallavi Prashanth Prize Money Issue - Sakshi

బిగ్‌బాస్‌ 7 ముగిసిపోయి ఇప్పటికి రెండు నెలలు దాటింది. ఈ సీజన్‌ విన్నర్‌గా పల్లవి ప్రశాంత్‌ నిలిచిన విషయం తెలిసిందే. రైతుబిడ్డ ట్యాగ్‌లైన్‌తో ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టిన ప్రశాంత్‌ విజేతగా నిలిచాడు. తన స్ట్రాటజీతో గేమ్‌ ఆడుతూ ప్రత్యర్థులను ఎదుర్కుంటూ ఒక్కోమెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకున్నాడు. విజేతగా నిలుస్తే వచ్చే ప్రైజ్‌ మనీని పేద రైతులకు ఉపయోగిస్తానని  పలుమార్లు చెప్పాడు. ఇప్పుడా విషయంపై సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. దీంతో ప్రశాంత్‌ కూడా రియాక్ట్‌ అయ్యాడు.

రైతుల పేరుతో గెలిచి.. అమ్మాయిలతో ఎంజాయ్‌
అందరూ అనుకున్నట్లే ప్రశాంత్‌ విజేతగా నిలిచాడు.. రోజులు గడుస్తున్నా అతను ముందుగా చెప్పినట్లు ప్రైజ్‌ మనీ నుంచి రైతులకు సాయం చేసినట్లు కనిపించలేదు. అంతేకాకుండా పలు టీవీ కార్యక్రమాలలో పాల్గొంటూ రెమ్యునరేషన్‌ అందుకుంటున్నాడు. బిగ్‌బాస్‌ స్నేహితులతో పార్టీలలో కనిపిస్తున్నాడు. పలు షాప్స్‌ ఓపెనింగ్స్‌కు అతిథిగా వెళ్తున్నాడు... ఇలా నిత్యం బిజీగా మారిపోయిన పల్లవి ప్రశాంత్‌.. రైతులకు తన ప్రైజ్‌ మనీ ఇస్తానని ఇచ్చిన మాట మరిచిపోయాడంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు.

కొందరైతే ఏకంగా రైతుల పేరుతో గెలిచి వారికి ఇచ్చిన మాటను తప్పడమే కాకుండా అమ్మాయిలతో బుల్లితెరపై బాగానే ఎంజాయ్‌ చేస్తున్నావ్‌ అంటూ చెప్పుకొస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు సాయం చేసే ఆలోచన ఉంటే ఎప్పుడో చేసేవాడు.. ఆ డబ్బు కూడా అతనికి చేరడమే కాకుండా ఖర్చు కూడా అయిపోయి ఉంటుంది. ఆ డబ్బు గురించి ఇక అందరూ మరిచిపోండి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం రైతులకు ఇవ్వాల్సిన అవసరం లేదని.. అతను కూడా పేదరికంతో ఉన్నాడని అతని భవిష్యత్‌ కోసం ఆ డబ్బు ఉపయోగించుకోవాలని తెలుపుతున్నారు.

వాస్తవంగా అమర్‌దీప్‌ గెలుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ప్రశాంత్‌కు రైతుబిడ్డ అనే సింపతీ ఎక్కువగా ఉపయోగపడటంతో విజేతగా నిలిచాడు. ఇప్పుడు అదే ట్యాగ్‌లైన్‌ ప్రశాంత్‌కు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రశాంత్‌ రియాక్షన్‌
తాజాగా ఈ విషయంపై ప్రశాంత్‌ ఇలా రియాక్ట్‌ అయ్యాడు.  'ప్రాణం పోయిన ఇచ్చిన మాట మరువను. నేను ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తాను. నిరూపేద రైతు కుటుంబాల కోసం ఇచ్చిన మాట ప్రకారం బిగ్‌బాస్‌ ప్రైజ్‌ మనీతో త్వరలో మీ ముందుకు వస్తాను.' అని ప్రశాంత్‌ చెప్పాడు.

ప్రశాంత్‌కు వచ్చేది ఎంత
బిగ్‌బాస్‌ విజేతకు రూ. 50 లక్షల ప్రైజ్‌మనీ అని ప్రకటించారు. కానీ ప్రిన్స్‌ యావర్‌ రూ.15 లక్షల సూట్‌కేసు తీసుకోవడంతో రైతుబిడ్డకు రూ.35 లక్షలు మాత్రమే మిగిలాయి. ఇందులోనూ టాక్స్‌, జీఎస్టీ పోగా అతడి చేతికి దాదాపు రూ.17 లక్షలు మాత్రమే అందనున్నట్లు తెలుస్తోంది. మరీ ఈరేంజ్‌లో కోతలు ఉంటాయా? అంటే నిజంగానే ఉంటుందట. బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ విన్నర్‌ వీజే సన్నీ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. తనకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వాల్సిందని, కానీ ఇందులో దాదాపు రూ.27 లక్షల వరకు ప్రభుత్వానికే వెళ్లిపోయిందన్నాడు.

ట్యాక్స్‌ కట్‌ చేసుకున్న తర్వాతే మిగిలిన డబ్బును తనకు ఇచ్చారన్నాడు. ఇప్పుడు ప్రశాంత్‌ ఇచ్చిన మాట ప్రకారం ప్రైజ్‌ మనీ పంచితే.. ఆయనకు అదనంగా వచ్చిన మారుతి బ్రెజా కారు, రూ. 15 లక్షల విలువ చేసే వజ్రాభరణం మిగిలినట్లు అవుతుంది. ప్రశాంత్‌కు బిగ్‌బాస్‌ నుంచి ఒక వారానికి రూ. లక్ష రెమ్యునరేషన్‌ అందుకున్నట్లు సమాచారం. అంటే 15 వారాలకు సుమారుగా రూ.15 లక్షలు ఈ రూపంలో దక్కినట్లు అని చెప్పవచ్చు.

Advertisement
 
Advertisement
 
Advertisement