Bigg Boss: టైటిల్ గెలిచినా.. స్టార్‌డమ్ రాలేదు? | Bigg Boss 9 Telugu: Shiva Balaji To Nikhil, Special Story On Bigg Boss Winners Career | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్ టైటిల్ గెలిచినా.. స్టార్‌డమ్ ఎందుకు రాలేదు?

Dec 21 2025 1:44 PM | Updated on Dec 21 2025 3:04 PM

Bigg Boss 9 Telugu: Shiva Balaji To Nikhil, Special Story On Bigg Boss Winners Career

‘బిగ్‌బాస్‌’ షోతో కెరీర్‌ పరంగా ఎదగాలి..  కంటెస్టెంట్స్‌ ఆలోచన ఇది. కంటెస్టెంట్స్‌ అంతా సెలబ్రిటీలే కాబట్టి వారి ఇమేజ్‌తో షోని సక్సెస్‌ చేసుకోవాలి.. ‘బిగ్‌బాస్‌’ స్ట్రాటజీ ఇది. ఇందులో ఇప్పటి దాకా బిగ్‌బాస్‌ యూనిట్‌ గెలుస్తూ వచ్చింది. ఎందుకంటే ఎనిమిది సీజన్స్‌లో విన్నర్స్‌ కానీ, కంటెస్టెంట్స్‌ కానీ హౌస్‌‌ నుంచి బయటకొచ్చిన తర్వాత పెద్దగా సాధించిందేమీ లేదు. వాళ్ల కెరీర్‌కి షో ప్లస్‌ అయిందీ లేదు.

బిగ్‌బాస్‌ 1విన్నర్‌గా శివ బాలాజీ విజేతగా నిలిచాడు. నిజానికి బిగ్ బాస్‌లో పాల్గొనే నాటికే శివ బాలాజీ హీరోగా ప్రేక్షకులకు సుపరిచితం. 'అనగనగా ఒక రోజు', 'చందమామ' వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్‌ బాస్‌తో మరింతగా ఆడియన్స్‌కి దగ్గరైయ్యాడు. ఆ సీజన్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. కానీ… ఆ తర్వాత శివ బాలజీ కెరీర్‌లో పెద్ద మార్పు అయితే రాలేదు. కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ చేశాడు, కానీ హీరోగా బ్రేక్ రాలేదు. ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నట్లు, షో అతనికి మరింత పాపులారిటీ ఇచ్చినా, అవకాశాలు పెరగలేదు. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌పై ఫోకస్ చేస్తున్నాడు.

బిగ్‌ బాస్‌ 2 విన్నర్‌ కౌశల్‌ పరిస్థితి అయితే మరీ దారుణం. షో జరిగినన్ని రోజులు కౌశల్‌ పేరు మారుమోగింది. కౌశల్‌ ఆర్మీ పేరుతో యువత హల్‌చల్‌ చేశారు. బిగ్‌బాస్‌ షోలో ఏ కంటెస్టెంట్‌కు రాన్నంత ఇమేజ్‌ కౌశల్‌కు వచ్చింది. బిగ్‌బాస్ విజేతగా కౌశల్ గెలిచిన తర్వాత అతడికి వరుస ఆఫర్స్‌ వస్తాయని ఆశించారు.  కానీ, షో తర్వాత అతని పేరు క్రమంగా మరుగున పడింది. టాలీవుడ్‌లో పెద్ద అవకాశాలు రాలేదు. కొన్ని వెబ్ సిరీస్‌లు, చిన్న రోల్స్ చేశాడు, కానీ స్టార్‌డమ్ రాలేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగినా, కెరీర్ మలుపు తిరగలేదు. నేడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాడు, కానీ ఇండస్ట్రీలో హైలైట్ కాలేదు.

సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌కి ఈ షో కాస్త ఉపయోగపడింది. బిగ్‌బాస్‌ 3 విన్నర్‌గా నిలిచిన తర్వాత రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆర్థిక పరిస్థితిలో మార్పు వచ్చింది. బెంజ్‌ కారు కొనేదాకా ఆయన ఆర్థిక స్థాయి వచ్చింది. కానీ  బ్రేక్‌ వచ్చే స్థాయిలో కెరీర్‌ పరంగా అద్భుతాలు ఏం జరగలేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ఆయనకు ఇంకాస్త పేరు అయితే వచ్చింది. కానీ అటు సింగర్‌గాను, ఇటు యాక్టర్‌గానే అంత బిజీ అయితే కాలేదు.

బిగ్‌బాస్‌ 4 విన్నర్‌ అభిజిత్‌ పరిస్థితి కూడా అంతే . హీరోగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'తో ఫేమస్ అయిన అభిజిత్, షోలో తన ఇంటెలిజెన్స్, స్ట్రాటజీతో విన్నర్ అయ్యాడు. షో అతనికి మరింత పాపులారిటీ ఇచ్చినా, కెరీర్‌లో మార్పు రాలేదు. కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ చేశాడు, కానీ హీరోగా హిట్ రాలేదు. ఫిలిం ఇండస్ట్రీలో అతని పేరు ఇప్పుడు తక్కువగా వినిపిస్తోంది.

బిగ్‌బాస్‌ 5 విజేతగా వీజే సన్నీకి కూడా ఈ షో పెద్దగా ఉపయోగపడలేదు.సీరియల్ యాక్టర్‌గా ఫేమస్ అయిన సన్నీ, షోలో తన హ్యూమర్, టాస్క్ పెర్ఫార్మెన్స్‌తో గెలిచాడు. షో తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా ట్రై చేశాడు, కానీ అవి వర్కౌట్ కాలేదు. పేరు పెద్దగా వినిపించడం లేదు. సీరియల్స్‌కు తిరిగి వచ్చాడు.

సీజన్ 6 విన్నర్‌గా సింగర్‌ రేవంత్‌ నిలిచాడు.  సింగర్‌గా ఇండియన్ ఐడల్ విన్నర్ అయిన రేవంత్, షోలో తన వాయిస్, పర్సనాలిటీతో ఆకట్టుకున్నాడు. షో తర్వాత అతని సింగింగ్ కెరీర్ మెరుగుపడింది – 'కల్కి 2898 AD' వంటి సినిమాల్లో సాంగ్స్ పాడాడు. కానీ, పెద్ద స్టార్‌డమ్ రాలేదు. సింగర్‌గా కొనసాగుతున్నాడు, షో అతనికి మధ్యస్థంగా ఉపయోగపడింది. 

బిగ్‌ బాస్‌ 7 పల్లవి ప్రశాంత్‌ పరిస్థితి కూడా అంతే.'రైతు బిడ్డ'గా ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్, షోలో అనూహ్య ఫాలోయింగ్ సంపాదించాడు. కానీ, షో తర్వాత అతని ఇమేజ్ డ్యామేజ్ అయింది – కాంట్రవర్సీలు, లీగల్ ఇష్యూస్ వచ్చాయి. సినిమా అవకాశాలు రాలేదు, పేరు నెగెటివ్‌గా మారింది.

బిగ్‌బాస్‌ 8 విన్నర్‌గా నిలిచిన  నిఖిల్‌కి కూడా ఈ షోతో పెద్దగా ఒరిగిందేమి లేదు. షో తర్వాత కూడా ఆయన అదే సీరియల్స్‌లో కొనసాగుతున్నాడు. కానీ హీరోగా బ్రేక్ రాలేదు. కెరీర్‌లో పెద్ద మార్పు లేదు.

బిగ్ బాస్ తెలుగు విన్నర్ల చరిత్ర చూస్తే, షో అందరికీ పబ్లిసిటీ ఇస్తుంది, కానీ దీర్ఘకాలిక కెరీర్ బూస్ట్ చాలా మందికి రాలేదు. రాహుల్ సిప్లిగంజ్, రేవంత్ వంటి వారికి కాస్త ఉపయోగపడినా, మిగతా వారు సీరియల్స్ లేదా చిన్న రోల్స్‌కు పరిమితమయ్యారు. కాంట్రవర్సీలతో ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నవారు కూడా ఉన్నారు. మరికొంతమందికి ఈ షో తర్వాత అవకాశాలు కూడా తగ్గిపోయాయి.  మరి సీజన్‌ 9లో ఎవరు విన్నర్‌ అవుతారు? వారి కెరీర్‌ ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement