బిగ్‌బాస్‌ అపూర్వ ఎలిమినేట్‌ .. హౌస్‌మేట్స్‌ బండారం బట్టబయలు | Bigg Boss 10 Telugu Day 35 Episode 36 October 11 Written Updates Apoorva Is Eliminated By Audience Votes | Sakshi
Sakshi News home page

Apoorva Is Eliminated: బిగ్‌బాస్‌ అపూర్వ ఎలిమినేట్‌ .. హౌస్‌మేట్స్‌ బండారం బట్టబయలు

Oct 11 2026 8:17 PM | Updated on Oct 11 2026 8:38 PM

Bigg Boss 10 Telugu Day 35 Episode 36 October 11 Written Updates Apoorva Is Eliminated By Audience Votes

బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో ఐదో వారం ఉత్కంఠకు తెరపడింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన అపూర్వ ప్రయాణం ముగిసింది. బయట జరుగుతున్న ఆటను చూసి వచ్చినా.. హౌస్‌లో తనదైన ముద్ర వేయడంలో ఆమె విఫలమైంది. ముఖ్యంగా షాలినీ, త్రిగుణ్‌లతో వివాదాలకే పరిమితం కావడంతో ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు పొందలేకపోయింది. దీంతో ఐదో వారం ఓటింగ్‌లో వెనుకబడిన అపూర్వ ఎలిమినేట్‌ అయింది. అయితే హౌస్‌ నుంచి బయటకు వెళ్లే ముందు పలువురు కంటెస్టెంట్లకు ఆమె ఇచ్చిన సలహాలు, చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఝాన్సీ ఎమోషనల్‌.. 
ఐదో వారం ఎలిమినేషన్‌లో భాగంగా అపూర్వ పేరు ప్రకటించడంతో హౌస్‌లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఆమె బయటకు వెళ్తుందని తెలిసిన ఝాన్సీ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఇంట్లో నీ గురించే ఎక్కువగా బాధపడతానని చెబుతూ అపూర్వకు వీడ్కోలు పలికింది. ఆటను జాగ్రత్తగా ఆడాలని ఝాన్సీకి సూచించిన అపూర్వ.. హౌస్‌ నుంచి బయటకు వచ్చింది.

స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత తన బిగ్‌బాస్‌ ప్రయాణానికి సంబంధించిన వీడియోను చూసి అపూర్వ భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా ఇంట్లోకి అడుగుపెట్టే ముందు తన తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంది. ‘మా నాన్న ఇంట్లోకి వచ్చే ముందు పరువు తీయకు.. పరువు నిలబెట్టు చాలు అని చెప్పారు. నేను అదే చేశానని అనుకుంటున్నా’ అని అపూర్వ చెప్పుకొచ్చింది.

రోహిత్‌కు హద్దుల్లో ఉండాలని హితవు
అనంతరం నాగార్జున సూచనతో అపూర్వ హౌస్‌మేట్స్‌కు బిట్టర్‌ షాట్స్‌ ఇస్తూ వారి ఆటపై తన అభిప్రాయాలను వెల్లడించింది. మొదట రోహిత్‌కు బిట్టర్‌ షాట్‌ ఇచ్చింది. పక్కన ఉన్నవారిని తక్కువగా చూడొద్దని, తనను తాను ఎక్కువగా అంచనా వేసుకోవడం తగ్గించుకోవాలని సూచించింది. ఆటలో సమీకరణాలు ఎప్పుడైనా మారవచ్చని హెచ్చరించింది. తన ఆటపై నమ్మకం ఉండటం మంచిదే కానీ, అది హద్దులు దాటకూడదని రోహిత్‌కు హితవు పలికింది.

రామ్‌ ప్రసాద్‌పై అపూర్వ ఘాటు వ్యాఖ్యలు
ఆ తర్వాత రామ్‌ ప్రసాద్‌కు బిట్టర్‌ షాట్‌ ఇచ్చిన అపూర్వ.. రిలేషన్స్‌ కారణంగా ఆటలో ఇతరులపై ఆధిపత్యం చెలాయిస్తున్నావంటూ విమర్శించింది. నీ స్వభావంలో స్వార్థం కనిపిస్తోందని, ఒకరి కోసం మరొకరికి అన్యాయం చేస్తున్నావని వ్యాఖ్యానించింది. ఆటలో వ్యక్తిగత సంబంధాల ప్రభావం ఎక్కువ కాకుండా చూసుకోవాలని పరోక్షంగా సూచించింది.

షాలినీకి కీలక సలహా
షాలినీ ఆట తీరుపైనా అపూర్వ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది. ‘నిన్ను నువ్వు కోల్పోయావ్‌.. అగ్నిపరీక్షలో ఉన్నది వేరు, ఇక్కడ ఆట వేరు. చెట్టు చాటున ఉంటున్నావ్‌.. నీ కోసం నువ్వు ఆడు. ఆటలోకి దిగు.. వేరే విషయాల్లోకి వెళ్లిపోయావ్‌’ అంటూ సూచించింది. ఎదుటివారు చెప్పేది పూర్తిగా విన్న తర్వాతే స్పందించాలని సలహా ఇచ్చింది. తన మాటలు నచ్చితే స్వీకరించాలని, లేదంటే వదిలేయవచ్చని షాలినీకి చెప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement