
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ మూవీ ఫేమ్ మున్నా ధులిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో రేణూ దేశాయ్, రోహన్ సూర్య, మొయిన్ కీలక పాత్రధారులు. శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం టైటిల్ మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ చందు మొండేటి మాట్లాడుతూ – ‘‘బ్యాడ్ గాళ్స్’లోని నటీనటులు, సాంకేతిక నిపుణులు నాకు పరిచయం ఉన్నవాళ్లే. ఈ మూవీ పెద్ద హిట్టవ్వాలి’’ అని కోరారు. ‘‘నా మిత్రుడు మున్నా కష్టానికి తగ్గ ఫలితం రావాలి’’ అన్నారు కృష్ణ చైతన్య. ‘‘నలుగురు కొత్త అమ్మాయిలను పెట్టి సినిమా చేయడం సాహసమే’’ అని శివ నిర్వాణ చెప్పారు.
‘‘అమ్మాయిలకు పెళ్లికి ముందు ఉండే స్వేచ్ఛ పెళ్లి తర్వాత ఉండదు. అలాంటి చాలామంది కథల స్ఫూర్తితో ఈ సినిమా తీశాను. అమ్మాయిలను భయంతో కాదు ధైర్యంగా ఓ అమ్మోరులా పెంచాలి’’ అని మున్నా చెప్పారు. ‘‘కుటుంబంతో సహా ప్రేక్షకులు మా సినిమాని చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు.