టైటిల్: బా బా బ్లాక్ షీప్
నటీనటులు: టిను ఆనంద్, ఉపేంద్ర లిమాయె, రాజా రవీంద్ర, అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్, కార్తికేయ, విస్మయ శ్రీ, మాల్వీ మల్హోత్రా, సమృద్ధి ఆర్యల్, శుభలేఖ సుధాకర్, జార్జ్ మరియన్, కె.ఎల్. దామోదర్ ప్రసాద్, శివన్నారాయణ, అనీష్ కురువిల్లా తదితరు
నిర్మాణ సంస్థ: చిత్రాలయం స్టూడియోస్
నిర్మాత: వేణు దోనేపూడి
దర్శకత్వం: గుణి మంచికంటి
సంగీతం: ఎలక్ట్రానిక్ కిలి, ఆనంద్ (ఆర్కాడొ)
సినిమాటోగ్రఫీ: అజయ్ అబ్రహం జార్జ్
ఎడిటింగ్: విజయ్ ముక్తవరపు
విడుదల తేది: అక్టోబర్ 9, 2026
కథేంటంటే..
సత్యనారాయణ అలియాస్ సత్తిపండు (విష్ణు ఓయ్) మేఘాలయాలో తన ప్రియురాలు మేరి (సమృద్ధి ఆర్యల్)ను పెళ్లి చేసుకోవడాని రెడీ అవుతుంటాడు. పెళ్లికి ముందు స్నేహితుడు సందీప్ (అక్షయ్ లగుసాని)తో కలిసి పార్టీ చేసుకోవాలనుకుంటాడు. మధ్యలోనే పోలీసులు రావడంతో పారిపోయేందుకు ప్రయత్నిస్తారు. ఈక్రమంలో సత్తిపండు కారు ప్రమాదానికి గురవుతుంది. అక్కడే సందీప్‌కి ఓ పెట్టె దొరుకుతుంది. దాన్ని తీసుకొని సత్తిపండు పెళ్లికి వెళ్తాడు. అక్కడికి గ్యాంగ్ స్టర్ జాన్(ఉపేంద్ర లిమాయో) వస్తాడు. పెట్టె కనిపించకపోవడంతో సందీప్, సత్తిపండులను కిడ్నాప్ చేసి తనదైన శైలిలో వేధిస్తాడు. బాక్స్ ఇవ్వకపోతే సత్తిపండుని చంపేస్తానని బెదిరిస్తాడు. ఫ్రెండ్ కోసం సందీప్.. మరో ఫ్రెండ్ జాన్వీ(విస్మయశ్రీ)తో ఆ బాక్స్‌ని వెతకడానికి వెళ్తాడు. మరి ఆ బాక్స్ దొరికిందా? అందులో ఏముంది? బాక్స్ కోసం జాన్ ఏం చేశాడు? చివరికి ఆ బాక్స్ ఎవరికి దొరికింది? సత్తిపండు పెళ్లి చివరకు ఏమైంది? ఈ కథలో శుభలేక సుధాకర్, రాజా రవీంద్ర పాత్రలు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
క్రైమ్ కామెడీ కథకు వినోదాన్ని జోడిస్తూ దర్శకుడు గుణి మంచికంటి సినిమాను తెరకెక్కించారు. కథలోని ప్రధాన అంశం చుట్టూ పాత్రలను, సంఘటనలను నడిపిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు. కథ ప్రారంభమైన తీరు బాగుంది. కొన్ని సన్నివేశాల్లో కామెడీ మెప్పిస్తుంది. కథలో వచ్చే మలుపులు కూడా ఆసక్తిని రేకెత్తిస్తాయి. క్రైమ్ కామెడీ అంటే ఆడియెన్స్ మైండ్‌లో సినిమాను ఇలాగే తెరకెక్కించి ఉంటారనే ఆలోచన ఉంటుంది. దానికి తగ్గట్లుగానే ఈ కథనం సాగుతుంది. అయితే కథను ఆసక్తికరంగా మలచాల్సిన సన్నివేశాలు మాత్రం సాధారణంగా అనిపిస్తాయి. పాత్రల మధ్య జరిగే సంఘటనలు ప్రేక్షకులను పూర్తిస్థాయిలో కథలోకి తీసుకెళ్లలేవు.కామెడీ మాత్రం బాగానే వర్కౌట్ అయింది. లాజిక్కులు, కొత్తదనం ఆశించకుండా వెళ్తే.. ఈ సినిమా వినోదం పంచుతుంది.
ఎవరెలా చేశారంటే..
సందీప్ పాత్రకి అక్షయ్ లగుసాని న్యాయం చేశాడు. తెరపై ఉత్సాహంగా కనిపించాడు. డ్యాన్స్ కూడా బాగానే చేశాడు. సత్తిపండుగా విష్ణు ఓయ్ తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో నవ్వులు పంచాడు. అతడి పాత్రలోని వైవిధ్యం కొన్ని సన్నివేశాల్లో బాగా కనిపిస్తుంది. గ్యాంగ్‌స్టర్ జాన్ పాత్రలో ఉపేంద్ర లిమాయె మరోసారి తన అనుభవాన్ని చూపించారు. కథలో కీలకమైన ఈ పాత్రను తనదైన నటనతో రక్తికట్టించే ప్రయత్నం చేశారు. విస్మయ శ్రీ, మాల్వీ మల్హోత్రా తమ పాత్రలకు న్యాయం చేశారు. పోలీస్ ఆఫీసర్‌గా రాజా రవీంద్ర, మూర్తిగా శుభలేఖ సుధాకర్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. మిగతా నటీనటులు కూడా కథకు తగ్గట్టుగా నటించారు.
సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. మేఘాలయా లోకేషన్లను తెరపై మరింత అందంగా చూపించారు. ఎలక్ట్రానిక్ కిలి, ఆనంద్ (ఆర్కాడొ) అందించిన పాటలు, నేపథ్య సంగీతం కథకు అనుగుణంగా సాగాయి. ‘సమయమే ఇంద్రజాలం’, ‘వే వేల’, ‘ఆజా మేరి జాన్’ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.నేపథ్య సంగీతం ఓకే. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమాస్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.


