
సరైన పాత్రలు ఆఫర్ చేస్తేనే సినిమాలు చేస్తానంటున్నాడు ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి (Ashish Vidyarthi). తెలుగు, తమిళ, బెంగాలీ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసి విశిష్ట నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆశిష్ విద్యార్థి. ఈయన చివరగా కిల్, ఆవేశం చిత్రాల్లో నటించాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానల్‌లో ఆశిష్ విద్యార్థి మాట్లాడుతూ.. కొన్ని విషయాలు ఈరోజు చర్చించి తీరాల్సిందే! ప్రేక్షకులుగా మీరెప్పుడూ కరెక్టే!
గ్రేట్ యాక్టర్‌ను
ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ సినిమాలు చేయడం లేదు. అందరు కాకపోయినా కొందరైనా దానికి గల కారణం తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నారు. వారికోసమైనా నేను నోరు విప్పాల్సిందే! నేను గ్రేట్ యాక్టర్‌ని. కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశాను. అయితే ఇంతవరకు చేయని పాత్రల కోసం వెయిట్ చేస్తున్నాను. కథలో కీలక పాత్రలు ఆఫర్ చేస్తే తప్పకుండా యాక్ట్ చేస్తాను. ఈ విషయాన్నే దర్శకనిర్మాతలకు చెప్పాను.
11 భాషల్లో నటించా..
నా 30 ఏళ్ల కెరీర్‌లో 300 సినిమాలు చేశాను. 11 భాషల్లో నటించాను. ఇప్పుడు కొత్తదనం కావాలనుకుంటున్నాను. ప్రధాన పాత్రలే చేయాలనుకుంటున్నాను. కొన్నిసార్లు మనం ప్రపంచానికి దూరంగా ఉంటాం. కానీ, అలా అందరికీ దూరంగా ఉండి.. ఇంట్లో కూర్చుని ఒత్తిడికి లోనయ్యే టైప్ కాదు నేను అని చెప్పుకొచ్చాడు. కాగా ద్రోహకాల్ సినిమాకుగానూ ఆశిష్ ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే!
చదవండి: మొన్న నేషనల్ అవార్డ్.. ఇప్పుడు తెలుగు సింగర్ నిశ్చితార్థం