సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు ఏఆర్ రెహమాన్ (AR Rahman). ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించిన ఆయన బాల్యంలో ఎన్నో కష్టాలు చూశాడు. వాటిని తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు నేను ఎన్నో కష్టాలు అనుభవించాను. నానమ్మ మరణం. నాన్న మరణం.. ఈ రెండూ మా జీవితాలను కుదిపేశాయి. నాన్న చనిపోయినప్పుడు నాకు తొమ్మిదేళ్లే!
ఎన్నో అవమానాలు
ఒంటరి తల్లిగా అమ్మ ఎన్నో బాధలు భరిస్తూ మమ్మల్ని పెంచింది. ఎన్ని అవమానాలు ఎదురైనా సరే కుంగిపోకుండా మమ్మల్ని ముందుకు నడిపించింది. నా బాల్యం అంతా చెన్నైలోనే గడిచింది. నేను అక్కడే పుట్టాను. మా నాన్న అక్కడి స్టూడియోలలోనే పనిచేసేవారు. కోడంబాక్కం దగ్గర్లోనే మేముండేవాళ్లం. నా పేరెంట్స్‌ను వారి కుటుంబసభ్యులే ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. నడివీధిలో నిలబెట్టారు. మాకంటూ మంచి ఇల్లుండాలని నాన్న పగలూరాత్రి తేడా లేకుండా కష్టపడేవాడు.
కోలుకోవడానికి చాలా ఏళ్లు
విశ్రాంతి లేకుండా రోజులో మూడు ఉద్యోగాలు చేసేసరికి ఆయన గుండె అలిసిపోయి ఒకరోజు ఆగిపోయింది. ఈ విషాదం నుంచి కోలుకోవడానికి నాకు చాలా ఏళ్లు పట్టింది అని చెప్పుకొచ్చాడు. ఏఆర్ రెహమాన్ చివరగా ధనుష్-కృతీ సనన్‌ల 'తేరే ఇష్క్ మే' సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా నవంబర్ 28న విడుదల కానుంది. ప్రస్తుతం రామ్‌చరణ్ 'పెద్ది' మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. అలాగే రామాయణ: పార్ట్ 1, జీనీ వంటి పలు చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు.


