తెలుగులో గతంలో చాలా సినిమాలు చేసినప్పటికీ రీసెంట్ టైంలో 'చికిరి' పాటతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. మద్రాసులో పుట్టి పెరిగిన ఇతడు.. దక్షిణాదితో పాటు హిందీలోనూ గత మూడు దశాబ్దాలుగా సంగీతమందిస్తూనే ఉన్నాడు. అయితే రెహమాన్ అసలు పేరు ఇది కాదని మీలో ఎంతమందికి తెలుసు? అవును స్వతహాగా హిందూ అయిన ఇతడు ఇస్లాం మతంలోకి మారాడు. పేరు మార్చుకున్నాడు. ఇంతకీ ఇదంతా ఎప్పుడు ఎలా జరిగింది? అనేది ఇప్పుడు చూద్దాం.
(ఇదీ చదవండి: 'జన నాయగణ్' సినిమాపై రాజకీయ కుట్ర?)
చెన్నైలో 1967 జనవరి 6న ఆర్కే శేఖర్, కస్తూరి దంపతులకు దిలీప్ పుట్టాడు. ఇతడికి ఓ అక్క, ఇద్దరు చెల్లెళ్లు. శేఖర్ సంగీత దర్శకుడు. దిలీప్‌కి తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు తండ్రి శేఖర్ చనిపోయారు. దీంతో కుటుంబాన్ని పోషించేందుకు తండ్రి పరికరాలని అద్దెకిస్తూ వీళ్లు జీవనం సాగించారు. రెండేళ్లు గడిచేసరికల్లా అంటే 11వ యేటా దిలీప్.. కుటుంబ భారాన్ని మోసేందుకు సిద్దమయ్యాడు. పలువురు సంగీత దర్శకుల దగ్గర కీబోర్డ్, పియానో లాంటివి వాయించడం మొదలుపెట్టాడు. దిలీప్ తల్లికి ఆధ్యాత్మికత ఎక్కువ. ఇంట్లో హిందూ దేవతలతో పాటు ఇస్లాం, క్రైస్తవ మతానికి సంబంధించిన ఫొటోలు కూడా ఉండేవి. తల్లి కస్తూరితో కలిసి నెల్లూరి తడ దగ్గరలోని సూఫీ ప్రవక్త కరీముల్లా షా ఖాద్రీ బోధనలు వినేందుకు దిలీప్ వెళ్లేవాడు. ఈ క్రమంలో ఖాద్రీ బోధనలకు వీరు కుటుంబం ఆకర్షితులయ్యారు.
తమ కుటుంబానికి అంతా మంచి జరగాలని, కష్టాలు తొలగిపోవాలని కోరుకుంటూ దిలీప్ కుటుంబమంతా 1989లో ఇస్లాం మతాన్ని సీక్వరించారు. ఇది జరగడానికి కొన్నాళ్ల ముందు దిలీప్ చెల్లి పెళ్లి జరిగింది. ఆ సమయంలో ఓ జ్యోతిష్కుడిని కలిసిన ఇతడు.. తనకు దిలీప్ అనే పేరు నచ్చలేదని, ఏదైనా ముస్లిం పేరు సూచించాలని అడగ్గా.. అబ్దుల్ రహీమ్, అబ్దుల్ రెహమాన్ అనే పేర్లు సూచించారు. వీటి వల్ల అంతా మంచి జరుగుతుందని సదరు జ్యోతిష్కుడు సూచించారు. వీటిలో రెహమాన్ అనే పేరు నచ్చేసరికి దిలీప్ కాస్త రెహమాన్ అయ్యాడు. తల్లి కస్తూరి.. కొడుకు మార్చుకున్న పేరుకి ముందు 'అల్లా రఖా' అని జోడించింది. దీంతో దిలీప్ కాస్త ఏఆర్ రెహమాన్ అయ్యాడు.
తర్వాత కాలంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఏఆర్ రెహమాన్.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలానే తల్లి కస్తూరి కూడా తన పేరుని కరీమాగా మార్చుకుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. కడప పెద్ద దర్గా, కసుమూరు దర్గా, నెల్లూరు దర్గాని రెహమాన్ సందర్శిస్తుంటారు. తెలుగులో ఈయన.. నిప్పురవ్వ, సూపర్ పోలీస్, గ్యాంగ్ మాస్టర్, నీ మనసు నాకు తెలుసు, నాని, ఏ మాయ చేశావె, కొమరం పులి, సాహసం శ్వాసగా సాగిపో సినిమాలు చేశారు. దాదాపు పదేళ్ల తర్వాత 'పెద్ది'తో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.
(ఇదీ చదవండి: ఆ సినిమాలో చిన్మయి పాట కట్.. తేల్చేసిన దర్శకుడు)


