తమిళ హీరో దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగణ్'. మరో మూడు రోజుల్లో అంటే ఈ శుక్రవారమే తెలుగు, తమిళంలో విడుదల కానుంది. మన దగ్గర పెద్దగా బజ్ లేదు గానీ తమిళనాడులో మాత్రం మంచి హైప్ ఏర్పడినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు చిత్ర నిర్మాణ సంస్థ, మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ అసలేం జరుగుతోంది?
(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాకు టికెట్ రేట్ల పెంపుపై నిర్మాతల క్లారిటీ)
విజయ్ 'జన నాయగణ్' సినిమా మరో మూడు రోజుల్లో రిలీజ్ కావాలి. కానీ ఇప్పటివరకు సెన్సార్ బోర్డ్ నుంచి సర్టిఫికెట్ రాలేదు. దాదాపు రెండు వారాల క్రితమే సెన్సార్ బోర్డు సభ్యులు ఈ మూవీ చూశారు. మూడు రోజుల తర్వాత కొన్ని సీన్స్ కట్స్ చేయమని మూవీ టీమ్‌కి సూచించారు. అలా చేస్తే యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తామని కూడా చెప్పారు. రెండు రోజుల్లో ఆ ఫార్మాలిటీ అంతా టీమ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇది జరిగి రెండు రోజుల తర్వాత కూడా సెన్సార్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిర్మాణ సంస్థ మరోసారి అడిగింది.
ఇది జరిగిన తొమ్మిది రోజులకు అంటే నిన్న(జనవరి 05).. సినిమాని రివైజింగ్ కమిటీకి పంపుతున్నట్లు, ఏమైనా మాట్లాడాలనుకుంటే ముంబైలోని ఆఫీస్‌ని సంప్రదించాలని చెప్పారు. దీంతో నిర్మాణ సంస్థ.. సెన్సార్ సర్టిఫికెట్ కోసం హైకోర్టులో కేసు వేసింది. త్వరగా ఇది ఇప్పించాలని పేర్కొంది. అయితే సెన్సార్ ఫార్మాలిటీస్ అంతా పూర్తయినా సరే ఇలా జరగడం వెనక ఎవరున్నారు? చెప్పిన తేదీకి రిలీజ్ అవుతుందా లేదా అని విజయ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
(ఇదీ చదవండి: 'అఖండ-2' ఫ్యాన్స్‌కు ట్విస్ట్ ఇచ్చిన 'నెట్‌ఫ్లిక్స్')
రాజకీయ కారణాలతోనే తమ సినిమాకు ఇబ్బందులు పెడుతున్నారని విజయ్ టీవీకే పార్టీ ఆరోపణలు చేస్తోంది. విజయ్ పిటిషన్‌పై ఈ రోజు మధ్యాహ్నమే విచారణ జరగనుంది. ఇందులో ఏం తీర్పు వస్తుందో చూడాలి? ఈ ఏడాదిలోనే తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో విజయ్ సినిమాపై ఏమైనా రాజకీయ కుట్ర చేస్తున్నారా అనే సందేహం అభిమానులకు వస్తోంది.
ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహించగా.. పూజా హెగ్డే హీరోయిన్‌గా, మమిత బైజు కీలక పాత్ర చేసింది. తెలుగులో గతంలో వచ్చిన 'భగవంత్ కేసరి' రీమేక్ చేసి ఈ మూవీ తీశారు. కొన్నిరోజుల ముందు వరకు ఈ విషయమై రూమర్స్ వచ్చాయి గానీ తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌తో రీమేక్ అనే క్లారిటీ వచ్చేసింది. ట్రోల్స్ కూడా ఎక్కువగానే చేస్తున్నారు.
(ఇదీ చదవండి: ఆ సినిమాలో చిన్మయి పాట కట్.. తేల్చేసిన దర్శకుడు)


