'అన్వేషిప్పిన్ కండేతుమ్' సినిమా రివ్యూ (ఓటీటీ) | Sakshi
Sakshi News home page

Anweshippin Kandethum Review In Telugu: 'అన్వేషిప్పిన్ కండేతుమ్' రివ్యూ

Published Sun, Mar 10 2024 1:59 PM

Anweshippin Kandethum Movie Review And Rating Telugu - Sakshi

ఈ మధ్య మలయాళ సినిమాలు సెన్సేషన్ సృష్టించాయి. ఫిబ్రవరిలో రిలీజైన నాలుగు మూవీస్ కూడా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అందులో ఒకటే 'అన్వేషిప్పిన్ కండేతుమ్'. పోలీస్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ చిత్రం తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం?

(ఇదీ చదవండి: 'ప్రేమలు' సినిమా రివ్యూ)

కథేంటి?
ఆనంద్ నారాయణన్ (టొవినో థామస్) చింగావనం అనే ఊరిలో సబ్ ఇన్‌స్పెక్టర్. లవ్ లీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసు తన దగ్గరకు వస్తుంది. చాలా చాక్యంగా అన్ని ఆధారాలతో నేరస్తుడిని పట్టుకుంటారు. కానీ ఊహించని విధంగా అతడు పోలీసులు కళ్లముందే ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. దీంతో ఆనంద్ & టీమ్‌పై సస్పెన్షన్ వేటు. కొన్నాళ్లకు అనధికారికంగా ఆనంద్ టీమ్‌ దగ్గరకు మరో కేసు వస్తుంది. శ్రీదేవిని అమ్మాయి మర్డర్ కేసు ఇది. అందరూ చేతులెత్తేసిన ఈ కేసుని ఆనంద్ టీమ్ ఎలా పరిష్కరించింది? ఇంతకీ నిందుతుడు ఎవరనేదే 'అన్వేషిప్పిన్ కండేతుమ్' స్టోరీ.

ఎలా ఉందంటే?
థ్రిల్లర్ సినిమా అనగానే.. మిస్సింగ్ లేదా మర్డర్ కేసు. దొంగని పట్టుకోవడానికి ఓ పోలీసు ఆఫీసర్. సవాళ్లు, పలువురు వ్యక్తులపై అనుమానం. చివరకు నిందుతుడు ఎలా దొరికాడు? అనేదే మీకు గుర్తొస్తుంది. చెప్పుకోవడానికి బాగానే ఉన్నా ఎవరెంత గ్రిప్పింగ్‌గా తీశారా అనేదే ఇక్కడ పాయింట్. ఆ విషయంలో 'అన్వేషిప్పిన్ కండేతుమ్' మూవీ డిస్టింక్షన్‌లో పాస్ అయిపోయింది. ఒక్క టికెట్ మీద రెండు సినిమాలు అన్నట్లు ఈ చిత్రంలో హీరో రెండు కేసుల్ని సాల్వ్ చేస్తాడు.

సస్పెన్షన్‌లో ఉన్న హీరో.. ఎస్పీ ఆఫీస్‌కి రావడంతో సినిమా ఓపెన్ అవుతుంది. ఆ వెంటనే ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్తుంది. ఎస్సైగా ఆనంద్.. పోలీస్ స్టేషన్‌లో జాయిన్ కావడం, కొన్నాళ్లు గడవడం.. ఓ రోజు లవ్‌లీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసు వస్తుంది. ఇంటి పరిసరాల్లో వెతకగా ఆ అమ్మాయి శవం దొరుకుతుంది. ఎవరు చంపారు? ఎందుకు చంపారు అనేది ఫస్టాప్ అంతా చూపించారు. నిందితుడు విషయంలో ఓ షాకింగ్ ఘటన జరగడంతో ఇంటర్వెల్ పడుతుంది. ఈ సంఘటన.. ఆనంద్ & టీమ్‌ని ఇబ్బందుల్లో పడేస్తుంది. అదే టైంలో మరో అమ్మాయి మర్డర్ కేసు వీళ్ల దగ్గరికి వస్తుంది. దీన్ని చేధించడం అంతా సెకండాఫ్‌లో ఉంటుంది. 

(ఇదీ చదవండి: 'గామి' సినిమా రివ్యూ)

ఈ సినిమాలో మర్డర్ కేసు.. దొంగ దొరకడం అనే పాయింట్ చూపిస్తూనే.. పోలీస్ వ్యవస్థలో జరిగే రాజకీయాల్ని కూడా చూపించారు. 1980-90 కాలమానాన్ని తీసుకుని డైరెక్టర్ చాలా మంచి పనిచేశాడు. అప్పటి కాలానికి తగ్గట్లు డ్రస్సులు, ఇల్లు, వాతావరాణన్ని అద్భుతంగా క్రియేట్ చేశారు. అలానే హీరో పోలీసు అనగానే అనవసరమైన బిల్డప్పుల జోలికి పోకుండా స్టోరీకి తగ్గట్లు సినిమా తీశారు. దర్యాప్తు చూపించే విధానంగా మిమ్మల్ని ఎటు డైవర్ట్ చేయకుండా ఇంట్రెస్టింగ్‌గా చూసేలా చేస్తుంది. సాధారణంగా ఓ సినిమాలో ఒక్క కథ మాత్రమే ఉంటుంది. ఇందులో ఇంటర్వెల్ ముందు ఒకటి. తర్వాత ఒకటి ఉంటుంది. అంటే ప్రేక్షకులకు డబుల్ ధమాకా.

ఎవరెలా చేశారు?
అంకిత భావంతో పనిచేసే ఎస్సై ఆనంద్‌గా టొవినో థామస్ ఆకట్టుకున్నాడు. పాత్రకు ఎంత కావాలో అంత చేశాడు. మిగతా పాత్రధారులందరూ కూడా సినిమాకు తగ్గట్లు చేసుకుంటూ వెళ్లిపోయారు. ఇందులో హీరోయిన్లు లాంటి వాళ్లు ఎవరూ లేకపోవడం రిలాక్సింగ్ విషయం. రెండు వేర్వేరు కేసుల్లో డిఫరెంట్ యాక్టింగ్ తో టొవినో ఆకట్టుకున్నాడు.

ఇక టెక్నికల్ విషయాలకొస్తే.. డైరెక్టర్ డార్విన్ కురియాకోస్ ఫెర్ఫెక్ట్ థ్రిల్లర్ సినిమాని ప్రేక్షకులకు అందించాడు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్.. ఓ థ్రిల్లర్ మూవీకి కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. సినిమా చూస్తున్నంతసేపు మీకు కూడా ఓ టెన్షన్ క్రియేట్ అవుతుంది. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ కూడా బ్యూటీఫుల్. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ 1980 వాతావరణాన్ని ఉన్నది ఉన్నట్లు చూపించింది. ఓవరాల్‌గా చెప్పుకుంటే ఓ మంచి థ్రిల్లర్ చూసి చాలారోజులైంది అనుకుంటే 'అన్వేషిప్పిన్ కండేతుమ్' ట్రై చేయండి. పక్కా నచ్చేస్తుంది.

-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్

Rating:
Advertisement
 
Advertisement