దర్శక–నిర్మాత–నటుడు అనుపమ్ ఖేర్
‘‘సారాంశ్’ (1984) చిత్రంలో నాకు ప్రధాన పాత్ర (బీవీ ప్రధాన్) చేసే అవకాశం దక్కింది. అయితే ఆ సినిమా షూటింగ్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు ఆ పాత్ర నాకు దక్కే పరిస్థితి కనిపించలేదు. ఆ సమయంలో నేను తీవ్రంగా కుంగిపోయాను. ఆ పాత్ర కోసం దాదాపు ఆరు నెలలు సమయం కేటాయించాను. అయితే బీవీ ప్రధాన్ క్యారెక్టర్ నాకు దక్కేలా లేదని తెలిసినప్పుడు ఏర్పడిన నిరాశ నన్ను బాగా కుంగదీసింది. ఆ నిరాశ నన్ను ముంబై వదిలేద్దాం అని నిర్ణయించుకునేలా చేసింది’’ అని బాలీవుడ్ దర్శక–నిర్మాత–నటుడు అనుపమ్ ఖేర్ ‘ఇఫీ’ వేదికపై ఎంతో భావోద్వేగంగా గతం తాలూకు తన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
గోవాలో జరుగుతున్న 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భాగంగా ‘గివింగ్ అప్ ఈజ్ నాట్ ఏ ఛాయిస్’ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక సెషన్‌లో అనుపమ్ ఖేర్ పాల్గొన్నారు. అప్పుడు ‘సారాంశ్’ గురించి గుర్తు చేసుకున్నారు. అయితే బీవీ ప్రధాన్ పాత్ర తనకు దక్కేలా లేదని తెలిసిన తర్వాత చివరిసారిగా ఆ చిత్రదర్శకుడు మహేశ్ భట్‌తో మాట్లాడి, వెళ్లిపోదామనుకున్నారట అనుపమ్ ఖేర్.
అదే ఆయన జీవితాన్ని మార్చింది. ఆ విషయం గురించి అనుపమ్ ఖేర్ చెబుతూ – ‘‘చివరిసారిగా మహేశ్ భట్‌ను కలవడం నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆయన నా ఆవేదనని అర్థం చేసుకున్నారు. ఆ పాత్ర కోసం నేను ఆరు నెలలు వెచ్చించడం, సినిమాపై నాకున్న శ్రద్ధ, గౌరవాలను గుర్తించి బీవీ ప్రధాన్ పాత్రను నాతోనే చేయించారాయన. కాబట్టి అందరికీ నేను చెప్పేదొక్కటే... ఆశను ఎప్పుడూ వదులు కోవద్దు’’ అంటూ ‘మాస్టర్ క్లాస్’లో ఆయన స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు.
ఇదో అనూహ్యమైన అనుభవం – నటి–నిర్మాత నిహారిక
‘ఇఫీ’ వేడుకల్లో నటి–నిర్మాత నిహారిక సందడి చేశారు. తాను నిర్మించిన తొలి చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’ ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు నోచుకోవడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అలాగే చిత్రదర్శకుడు యదు వంశీకి ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌గా నామినేషన్ దక్కడం తనకు ఆశ్చర్యానందాన్ని కలిగిస్తోందనీ, ఇదొక అసాధారణమైన అనుభవం అనీ నిహారిక పేర్కొన్నారు.
ఇంకా చిత్రోత్సవాలకు హాజరైన ఇతర భాషలవారితో ‘సినిమా’ గురించిన విశేషాలను చర్చించారు. ఈ వేడుకల్లో పలు దేశ విదేశీ చిత్రాల ప్రదర్శనలు, వర్క్ షాప్స్, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఆదివారం కావడంతో సందర్శకులు భారీగా తరలివచ్చారు. చిత్ర ప్రదర్శనలు జరిగే చోట భారీ క్యూలు కనిపించాయి. – గోవా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి


