తమిళ సినిమా 'అదర్స్' ప్రమోషన్లలో నటి గౌరీ కిషన్‌కి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో 'మీ బరువెంత?' అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించడం వివాదస్పదమైంది. సినిమా గురించి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నా పర్సనల్ విషయాల గురించి ఎందుకు అడిగారని సదరు జర్నలిస్ట్‌పై గౌరీ ఫైర్ అయ్యారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్స్ గౌరికి మద్దతు తెలుపుతూ.. జర్నలిస్ట్‌ని ట్రోల్ చేశారు. చివరకు సదరు జర్నలిస్ట్ క్షమాపణలు చెప్పినా కూడా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. జర్నలిస్ట్ సారీని గౌరీ అంగీకరించలేదు.
'జవాబుదారీతనం లేని క్షమాపణ అసలు క్షమాపణే కాదు. ఆయన ప్రశ్నని నేను తప్పుగా అర్థం చేసుకున్నానని.. ఆయన బాడీ షేమింగ్ చేయలేదనడం కరెక్ట్ కాదు’ అంటూ ఆయన క్షమాపణలను తోసిపుచ్చింది. ఈ వివాదం ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు చిత్రపరిశ్రమం మొత్తం హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా దీనిపై హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్(Anu Emmanuel ) స్పందించింది. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న చాలా తప్పని అను చెప్పింది. ఒకరి బాడీపై కామెంట్స్ చేసే అధికారం ఎవరికీ లేదని అను పేర్కొంది.
గర్ల్‌ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా గౌరి కిషన్ ఇష్యూ గురించి ప్రశ్నించగా.. పై విధంగా సమాధానం చెప్పారు. ‘నేను ఆ ప్లేస్‌లో ఉంటే ఏడ్చేదాన్నేమో. ఆ జర్నలిస్ట్ గౌరీపై గట్టి గట్టిగా అరిచాడు. కానీ ఆమె ధైర్యంగా ఎదురించింది. హీరోని సినిమా విషయాల గురించి చక్కగా అడిగిన ఆ జర్నలిస్ట్.. హీరోయిన్ దగ్గరకు వచ్చేసరికి ‘బరువెంత?’అని అడిగాడు. సినిమాకు ఆమె బరువుకు ఏం సంబంధం? హీరోయిన్ అంటే లిప్‌స్టిప్ పెట్టుకొని మంచిగా రెడీ అయి ఉండడమేనా? అంతకు మించి కూడా మాలో వేరే టాలెంట్ ఉంటుంది. అది గుర్తించండి’ అని అను ఇమ్మాన్యుయేల్ పేర్కొంది.


