
పహల్గాం ఉగ్రదాడిపై అమితాబ్ బచ్చన్ భావోద్వేగ ΄పోస్ట్
కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన యావత్ భారతదేశాన్ని కలచివేసింది. ఈ ఘటనకు ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పహల్గాం ఘటన, ఆపరేషన్ సిందూర్‌లపై ఇప్పటికే పలువురు ప్రముఖ నటీనటులు స్పందించారు. తాజాగా ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘భార్యతో కలిసి వేసవి సెలవుల కోసం పహల్గాం వెళ్లిన భర్తను ఉగ్రమూక కాల్చి చంపింది.
తన భర్తను చంపవద్దని ఆ భార్య ఎంతగానో ఏడుస్తూ, ప్రాధేయపడినా ఆ ఉగ్ర ఉన్మాది వినలేదు. ఆమె కళ్ల ముందే భర్తను అతి కిరాతకంగా కాల్చి చంపాడు. ఆమెను విధవరాలని చేశాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని ఆ భార్య... తనను కూడా చంపేయమని అడిగినా... ‘నిన్ను చంపను... వెళ్లి చెప్పుకో..’ అని ఆ రాక్షసుడు అన్నాడు.
నా కుమార్తెలాంటి ఆమె మానసిక స్థితి చూస్తుంటే .. ‘ఆమె వద్ద చితాభస్మం ఉన్నా... సిందూరం ఎక్కడ అని ప్రపంచం అడుగుతోంది’ అని మా నాన్న (హరివంశ్ రాయ్ బచ్చన్) రాసిన ఓ పద్యంలోని వాక్యం నాకు గుర్తొచ్చింది. అందుకే నేను నీకు సిందూరం ఇస్తున్నా... అపరేషన్ సిందూర్... జై హింద్... భారత సైన్యమా... ఎప్పటికీ ఆగకు... వెనకడుగు వేయకు’’ అంటూ భావోద్వేగమైన ΄పోస్ట్‌ను షేర్ చేశారు అమితాబ్ బచ్చన్.