సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్)లో తెలుగు వారియర్స్ మొదటి విజయం అందుకుంది. కెప్టెన్ అక్కినేని అఖిల్ దూకుడుతో చెలరేగిపోయాడు.. ఫోర్లు, సిక్సర్లతో ఏకంగా సెంచరీ కొట్టాడు. దీంతో అభిమానుల్లో జోష్ నింపాడు. శనివారం సాయింత్రం వైజాగ్ వేదికగా ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన పోరులో పంజాబ్ దే షేర్ జట్టుపై తెలుగు వారియర్స్ 52 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. ఈ మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)-2026 సీజన్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన తెలుగు వారియర్స్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. కెప్టెన్ అక్కినేని అఖిల్ (101 పరుగులు 56 బంతుల్లో 7×4, 6×6) సెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు. అశ్విన్ బాబు (60 పరుగులు 51 బంతుల్లో 9×4)తో నిలిచాడు. తమన్ 4బంతుల్లో కేవలం 1రన్‌తో ఔట్ అయ్యాడు.
భారీ స్కోర్ ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ దే షేర్ జట్టు 18.2 ఓవర్లలోనే కేవలం 132 పరుగులకే ఆలౌటైంది. తెలుగు వారియర్స్ బౌలర్లలో వినయ్ మహదేవ్ 3, సామ్రాట్ 2 రెండు వికెట్లు తీసి జట్టు గెలుపులో కీలకంగా నిలిచారు. పంజాబ్ దే షేర్ జట్టు నుంచి కరణ్‌వాహి 56, హర్డీ సంధు 28 పరుగులతో టాప్‌లో నిలిచారు. చాలామంది సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఓటమి పాలయ్యారు. తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ 6 సిక్స్‌లతో ప్రేక్షకులను అలరించాడు. ఏకంగా సెంచరీ కొట్టడంతో ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.


