
పాకీజా (Actress Pakeezah Vasuki) పేరు చెప్పగానే గుర్తొచ్చే చిత్రం అసెంబ్లీ రౌడీ. ఈ మూవీలో నటి వాసుకి.. పాకీజాగా బ్రహ్మానందంతో కలిసి చేసే కామెడీ భలే ఉంటుంది. అందుకే.. ఎన్నో సినిమాల్లో నటించినా సరే తన పేరు పాకీజాగానే స్థిరపడిపోయింది. వాసుకి.. పెదరాయుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్ ఇలా అనేక సినిమాలు చేసి పేరు, డబ్బు సంపాదించింది. కానీ సంపాదించినదంతా పోగొట్టుకుని ఖాళీ చేతులతో, కడుపు మాడ్చుకుంటూ బతికేంత దుస్థితి చేరుకుంది.
కష్టాలు తీరాయనుకునేలోపే..
ఈ విషయం తెలిసిన టాలీవుడ్ ప్రముఖులు తనకు అండగా నిలిచారు. తోచిన సాయం చేశారు. దీంతో ఆమె కష్టాల నుంచి గట్టెక్కినట్లే అని అంతా అనుకునేలోపే తిరుపతి వీధుల్లో భిక్షాటన చేస్తూ కనిపించింది. ఇటీవల మరోసారి మీడియా ముందుకు వచ్చి తనకు పూట గడవడమే గగనంగా ఉందని కన్నీళ్లు పెట్టుకుంది. అయితే అందరూ సాయం చేసినా తిరిగి మళ్లీ కష్టాల ఊబిలోకి కూరుకుపోవడానికి గల కారణాన్ని పాకీజా తాజాగా బయటపెట్టింది.
దుబారా చేయలేదు
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో నేను కష్టాల్లో ఉన్నప్పుడు రూ.7.5 లక్షల దాకా సాయం అందింది. ఆ డబ్బు నేను వృథాగా ఖర్చు చేయలేదు. మూడున్నర లక్షల అప్పు తీర్చేసుకున్నాను. హైదరాబాద్‌లో ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాను. వంటసామాగ్రి కొనడం.. ఇక్కడినుంచి చెన్నై, కారైకూడి, మధురై వెళ్లడం.. ఇలా వీటికే డబ్బంతా అయిపోయింది.
అద్దె కట్టడమే కష్టంగా..
ఇక్కడ అవకాశాలు లేవని తమిళనాడు వెళ్లిపోయాను. అక్కడ రేకుల ఇంటికి వెయ్యి రూపాయల అద్దె కట్టడానికి కష్టమైపోయింది. ఇంట్లో పాచిపని చేస్తానంటే కూడా ఎవరూ పనివ్వడం లేదు, అదేమంటే నేను నటినని దూరం పెడుతున్నారు. ఆరు నెలల్లో పిచ్చిదాన్నైపోతానేమో అనిపించింది. ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. పది రూపాయల ఇడ్లీ పిండి కొనుక్కుంటే అది రెండు రోజులు వచ్చేది. ఉదయం, సాయంత్రం ఇడ్లీ చేసుకునేదాన్ని.
కన్నీళ్లు పెట్టుకున్న పాకీజా
మధ్యాహ్నం గంజి తాగేదాన్ని. నాన్‌వెజ్ మర్చిపోయి చాలాకాలమే అవుతోంది. ఇప్పుడు వచ్చిన రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని జాగ్రత్తగా దాచుకుంటాను. పొదుపుగా వాడుకుంటాను. ఇంకెన్నడూ సాయం కోసం అడగను అని పాకీజా కన్నీళ్లు పెట్టుకుంది. ఇదే ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ బ్యూటీ మిత్రా శర్మ.. పాకీజాకు రూ.50 వేలు సాయం చేసింది.
చదవండి: సాయం కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఫిష్ వెంకట్ కూతురు.. 'ప్రభాస్' సాయం