
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat) ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. కొద్దిరోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆస్పత్రిలో వెంకట్ చికిత్స తీసుకుంటున్నారు. పూర్తిగా మాట్లాడలేని స్థితిలో ఆయన ఉన్నారు. ఈ క్రమంలో తన కూతురు స్రవంతి మీడియాతో మాట్లాడింది. చాలా ఏళ్ల క్రితమే తన తండ్రి రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని స్రవంతి చెప్పింది.
సుమారు నాలుగేళ్ల నుంచి డయాలసిస్ ద్వారా తన తండ్రి ప్రాణాలను కాపాడుకుంటూ వస్తున్నట్లు ఆమె తెలిపింది. అయితే, ఇప్పుడు పరిస్థితి క్లిష్టంగా మారిందని, ఆపరేషన్ చేసి కనీసం ఒక కిడ్నీ అయినా మార్చాల్సిన పరిస్థితి ఉందని స్రవంతి చెప్పింది. అందుకు రూ. 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని, దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆమె కోరింది. తన తండ్రి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడం వల్ల ఆందోళనగా ఉందని ఆపరేషన్ కోసం కావాల్సినంత డబ్బు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతి కన్నీళ్లు పెట్టుకుంది.
దీనస్థితిలో ఉన్న తమను ఆదుకోవాలంటూ ఆమె కోరింది. అయితే, తాజాగా ఆమె మీడియాతో మరోసారి మాట్లాడుతూ.. హీరో ప్రభాస్ (Prabhas) టీమ్ నుంచి కాల్ వచ్చినట్లు తెలిపింది. ఆయన అసిస్టెంట్ కాల్ చేసి 'కిడ్నీ ఇచ్చే డోనర్ (దాత) ఉంటే ఏర్పాట్లు చేసుకోండి. ఆపరేషన్‌కు కావాల్సిన డబ్బు ఏర్పాటు చేస్తాం' అని హామీ ఇచ్చారని మీడియాతో ఆమె తెలిపింది.

తన తండ్రి రక్తం గ్రూపుతో మ్యాచ్ అయ్యే దాతలు ఎవరైనా ఉన్నారేమోనని ఎదురుచూస్తున్నట్లు ఆమె ఇలా చెప్పారు. 'నా రక్తం గ్రూప్ మ్యాచ్ కాకపోవడంతో డాక్టర్స్ తిరష్కరించారు. నాన్న తమ్ముడి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది. కానీ, ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దీంతో డాక్టర్స్ వద్దన్నారు. దాతలు ఎవరైనా ఉన్నారేమోనని పలు డోనర్ సంస్థలను సంప్రదిస్తున్నాం' అని ఆమె పేర్కొంది. ఫిష్ వెంకట్ చాలా సినిమాల్లో నటించారు. ఆది, గబ్బర్ సింగ్, నాయక్, బన్ని, దిల్, అత్తారింటికి దారేది, డీజే టిల్లు వంటి చిత్రాల్లో ఆయన మెప్పించారు.