
టాలీవుడ్ సహాయ నటిగా చాలా సినిమాలు చేసిన హేమ.. కొన్నాళ్ల నుంచి అస్సలు నటించట్లేదు. గతేడాది డ్రగ్స్ కేసులో బెంగళూరు పోలీసులకు పట్టుబడిన ఈమె.. కొన్నాళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగింది. ఎలాగోలా ఆ గండం నుంచి గట్టెక్కింది. అప్పటినుంచి వీలైనంత తక్కువగానే బయట కనిపిస్తున్న హేమ.. సోమవారం ఉదయం విజయవాడ దుర్గమ్మని దర్శించుకుంది. ఈ క్రమంలోనే గతేడాది జరిగిన విషయం గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది.
'ఈ రోజు దుర్గమ్మ దర్శనానికి వచ్చాను. అయితే ఈసారి ఓ ప్రత్యేకత ఉంది. గతేడాది మీరందరూ నాపై వేసిన నీలాపనిందులని దుర్గమ్మ తుడిచిపెట్టింది. చేయని తప్పునకు అందరూ నన్ను బలి చేశారు. అయితే నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చి ఈ రోజు నన్ను గుడికి వచ్చేటట్లు ఆ దుర్గమ్మే చేసింది. కానీ దాని నుంచి బయటపడటం నా వల్ల కాలేదు. ప్రతిక్షణం దుర్గమ్మ తల్లి.. నేనున్నాను నువ్వు ముందుకెళ్లు అని నన్ను బతికించింది'
'ఎన్ని జన్మలెత్తినా దుర్గమ్మ ఆశీస్సులు అండదండలు నేను మర్చిపోలేను. దయచేసి మీరు ఏదైనా వార్త వేసేటప్పుడు నిజానిజాలు తెలుసుకుని వేయండి. ఈ రోజు నేను గుడిలో ఉండి చెబుతున్నాను. ఏ తప్పు చేయలేదు' అని కన్నీళ్లు పెట్టుకుని హేమ ఎమోషనల్ అయిపోయింది. అలానే సినిమాల్లో నటించకపోవడానికి గల కారణాల్ని కూడా చెబుతూ.. ఈవెంట్స్, బిజినెస్ చాలా ఉన్నాయి. అందుకే గ్యాప్ తీసుకున్నాను. ప్రతి గుడిలో పూజారులు నా కోసం పూజలు చేశారు. హేమమ్మ క్షేమంగా రావాలని కోరుకున్నారు అని చెప్పుకొచ్చారు.