
తమిళనాడుకు చెందిన కోలీవుడ్ నటుడు, కరాటే మాస్టర్ షిహాన్ హుస్సేని (60) అనారోగ్యంతో కన్నుమూశారు. కోలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించిన ఆయనకు మంచి గుర్తింపే ఉంది. మార్షల్ ఆర్ట్స్‌లో చాలామందికి శిక్షణ ఇచ్చిన షిహాన్ హుస్సేనికి ఫ్యాన్స్ కూడా భారీగానే ఉన్నారు. పవన్ కల్యాణ్, దళపతి విజయ్ ఇద్దరూ కూడా ఆయన వద్దే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ముఖ్యంగా పవన్ ఆయన వద్దే మార్షల్ ఆర్ట్స్‌తో పాటు కరాటే, కిక్ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు.
కొన్ని నెలలుగా షిహాన్ హుస్సేని బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. అయితే, తన ఆర్థిక పరిస్థితి బాగాలేదని అందుకోసం తను నిర్మించుకున్న మార్షల్ ఆర్ట్స్ శిక్షణా కేంద్రాన్ని అమ్మేస్తున్నట్లు ఆయన చెప్పాడు. దానిని తన శిష్యుడు పవన్ కల్యాణ్ కొనుగోలు చేస్తే సంతోషిస్తానని ఆయన చివరగా కోరాడు. తన వేదన పవన్ వరకు వెళ్తే తప్పకుండా సాయం చేస్తాడని కూడా షిహాన్ హుస్సేని ఆశించాడు. ఆయన అభ్యర్తన పవన్ కల్యాణ్ వరకు చేరిందో లేదో తెలియదు. ఇప్పుడు షిహాన్ హుస్సేని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. దీంతో ఆయన వద్ద శిక్షణ పొందిన కొందరు శిష్యులు మాట్లాడుతూ.. మాస్టర్ చివరి కోరిక తీరకుండా వెళ్లిపోయారని వాపోతున్నారు.
పదిరోజుల క్రితం పవన్‌ను అభ్యర్థించిన షిహాన్ హుస్సేని
కొద్దిరోజుల క్రితం షిహాన్ హుస్సేన్ తన శిష్యుడు పవన్ కల్యాణ్ తన శిక్షణా కేంద్రాన్ని కొనమని కోరారు. ఈ క్రమంలో పవన్‌తో కొన్ని విషయాలను పంచుకున్నారు ' నా వద్ద శిక్షణ తీసుకుంటున్న సమయంలో అతనికి పవన్ అని పేరు పెట్టాను. ఈ మాటలు అతని చెవులకు చేరితే అతను తప్పకుండా స్పందిస్తాడని తెలుసు. అతను ఈ మార్షల్ ఆర్ట్స్ శిక్షణా కేంద్రాన్ని కొనుగోలు చేసి భవిష్యత్ తరాల కోసం నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. అతను ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి అని నాకు తెలుసు. కానీ, అతను నా దగ్గర శిక్షణ పొందిన రోజులు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి.
శిక్షణా కేంద్రాన్ని శుభ్రం చేయడమే కాదు.. ప్రతిరోజు నాకు టీ అందించే వాడు కూడా.. మార్షల్ ఆర్ట్స్ ను దేశవ్యాప్తంగా విస్తరింపచేయాలని ఇద్దరమూ మాట్లాడుకునే వాళ్లం. ఇప్పుడు దానిని పవన్ పూర్తి చేస్తాడని ఆశిస్తున్నాను.' అని హుస్సేని అన్నారు. ఈ శిక్షణ కేంద్రాన్ని వాణిజ్య సముదాయంగా లేదా నివాస అపార్ట్‌మెంట్‌గా మార్చే వ్యక్తికి అమ్మే బదులు, ఇది తన వారసత్వాన్ని సజీవంగా ఉంచడంలో సహాయపడుతుందని ఆయన నమ్మారు. ఆర్చరీలోనూ షిహాన్ హుస్సేని శిక్షణ ఇచ్చాడు. మార్షల్ ఆర్ట్స్ సుమారు 10 వేల మందికి పైగా ఆయన వద్ద ట్రైన్ అయ్యారు.. ఆర్చరీలో 1000 మందికి పైగా విద్యార్థులను ఆయన తయారు చేశారు.
పవన్ కల్యాణ్ స్పందన
మార్షల్ ఆర్ట్స్‌లో తనకు శిక్షణ ఇచ్చిన షిహాన్ హుస్సేని మరణంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి సమయంలో హుస్సేని కుటుంబ సభ్యులకు మరింత బలాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వద్ద కరాటేలో శిక్షణ పొందానని పవన్ చెప్పుకొచ్చారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారనే వార్త తనకు తెలిసిందని, ఈనెల 29న ఆయన్ని పరామర్శించడానికి చెన్నై వెళ్లాలనుకున్నానని ఆయన అన్నారు. ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వస్తుందనుకోలేదన్నారు.