కత్తిపట్టిన సీత.. విమర్శించిన 'శక్తి మ్యాన్' | Actor Mukesh Khanna Serious Ramayana Makers For Sita As Fighter | Sakshi
Sakshi News home page

Sai Pallavi Ramayana: సీత యోధురాలు కాదు.. నటుడు తీవ్ర విమర్శలు

Nov 10 2026 1:08 PM | Updated on Nov 10 2026 1:15 PM

Actor Mukesh Khanna Serious Ramayana Makers For Sita As Fighter

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటించిన ‘రామాయణ’ ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. రూ.500 కోట్లకు పైగానే కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో సీత పాత్రని చూపించిన విధానంపై 'శక్తిమ్యాన్' నటుడు ముకేశ్ ఖన్నా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌ తిరిగి రాబట్టుకోవడంపైనే నిర్మాతలు దృష్టి పెట్టారు తప్పితే రామాయణాన్ని ప్రామాణికంగా చూపించడంపై కాదని విమర్శించాడు.

(ఇదీ చదవండి: ఎందుకు ఇబ్బందిపెడతారు? రేణు దేశాయ్ పోస్ట్ వైరల్)

తన యూట్యూబ్ వ్లాగ్‌లో మాట్లాడిన ముకేశ్ ఖన్నా.. రామాయణం వంటి ఇతిహాసాలను సినిమాలుగా తీసేటప్పుడు దర్శకనిర్మాతలు తమ ఇష్టానుసారం మార్పులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించాడు. వాల్మీకి రామాయణంలో ఉన్న విషయాలని మార్చి, తమ సొంత ఊహలని జోడించి చూపించడం న్యాయమేనా? రామాయణం సినిమా విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో, యూట్యూబర్ల మధ్య పెద్ద చర్చ జరుగుతోంది. అందరూ సినిమాను సమీక్షిస్తున్నారు. సినిమా ఎంత వసూలు చేస్తుందో కూడా ఎవరికీ స్పష్టత లేదు. అయితే ఇక్కడ కథని ప్రామాణికంగా చెప్పడం కంటే రూ.4,000 కోట్ల బడ్జెట్‌ తిరిగి రాబట్టుకోవడమే అన్నట్లుగా ఉందని చెప్పుకొచ్చాడు. తాను ఇంకా ఈ సినిమా చూడలేదని, ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్, రివ్యూల ఆధారంగానే తన అభిప్రాయాలు వెల్లడిస్తున్నానని ముకేశ్ ఖన్నా స్పష్టం చేశాడు.

సీతాదేవి.. రాణి లక్ష్మీబాయిలా పోరాడటంపై చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో ఆమె ఇద్దరు, ముగ్గురు రాక్షసులతో పోరాడుతున్నట్లు చూపించారు. ఈ విషయం వాల్మీకి రామాయణంలో ఉందా అని నేను పరిశీలించాను. కానీ అలాంటి సన్నివేశం అందులో లేదు. నాకు తెలిసినంతవరకు సీతమ్మ ఎప్పుడూ యుద్ధం చేయలేదు. ఆమె యోధురాలు కాదు. ఒకవేళ ఆమె యోధురాలే అయితే, రావణుడు అపహరించడానికి వచ్చినప్పుడు ఎందుకు పోరాడలేదు? రావణుడు ఆమెను అంత సులభంగా ఎలా అపహరించగలిగాడు?” అని ముకేశ్ ఖన్నా ప్రశ్నించాడు.

సీతాదేవి పోరాట సన్నివేశాన్ని సమర్థిస్తూ నిర్మాతలు ఇచ్చిన వివరణ తనను ఆశ్చర్యపరిచిందని ముకేశ్ ఖన్నా అన్నాడు. ఒకే ఒక అసలైన రామాయణం ఉంది. దానిని వాల్మీకి రచించారు. అందులో ఉన్న విషయాలను దాటి మీరు మరో రెండు అడుగులు ముందుకు వెళ్లకూడదు. రామాయణానికి అనేక ఇతర రూపాలు వినోదం కోసం రచించబడ్డాయి. వాటి ఆధారంగా సినిమాలు తీస్తున్నప్పుడు ఇష్టానుసారంగా మార్పులు చేయడం ఎంతవరకు సమంజసం? మీరు ఖురాన్ లేదా బైబిల్‌లోని విషయాలను మార్చి చూపించగలరా? అలా చేయలేనప్పుడు రామాయణాన్ని మార్చడానికి మీకు ఎంత ధైర్యం? సీతమ్మ రాక్షసులతో పోరాడే సన్నివేశాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు? అసలు అలాంటి సన్నివేశాన్ని సినిమాలో ఎందుకు పెట్టారు? అని ముకేశ్ ఖన్నా ప్రశ్నించాడు.

మరోవైపు ఈ సినిమాలో సీతాదేవిని యోధురాలిగా చూపించడంపై గతంలో ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి కూడా స్పందించింది. కత్తి ఫైట్ సీన్స్ కోసం నేను కొంత ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. మనమందరం చిన్నప్పటి నుంచి సీతమ్మని ఒక ప్రత్యేకమైన రూపంలో చూస్తూ పెరిగాం. ఈ తరం ప్రేక్షకుల కోసం ఆమెను మరో కోణంలో చూపించడం చాలా బాగుందని నాకు అనిపించింది అని చెప్పింది.

(ఇదీ చదవండి: చరణ్‌తో సినిమా.. 'డోరతి' నటుడి క్లారిటీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement