శ్రీనివాసా చిట్టూరి, హరీష్ శంకర్, ‘అల్లరి’ నరేశ్, కామాక్షీ భాస్కర్ల, నాని కాసరగడ్డ
‘‘12ఏ రైల్వే కాలనీ’ లాంటి జానర్ సినిమా ఇప్పటివరకు నేను చేయలేదు. ఇలాంటి చిత్రాలకు విజు వల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ అద్భుతంగా ఉండాలి. ఈ మూడింటిలో మేం సక్సెస్ అయ్యాం’’ అని హీరో ‘అల్లరి’ నరేశ్ చెప్పారు. ‘అల్లరి’ నరేశ్, కామాక్షీ భాస్కర్ల జంటగా నటించిన చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’. ‘పొలిమేర’ ఫేమ్ అనిల్ విశ్వనాథ్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించి, షో రన్నర్‌గా చేసిన ఈ చిత్రానికి నాని కాసరగడ్డ దర్శకత్వం వహించారు.
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకులు హరీష్ శంకర్, వీఐ ఆనంద్, విజయ్ కనకమేడల ముఖ్య అతిథిలుగా హాజరై, ఈ సినిమా విజయం సాధించాలన్నారు. ‘‘ఈ సినిమాలో కావలసినన్ని ట్విస్ట్‌లు ఉన్నాయి. ఇంట్రవెల్ బ్యాంగ్‌కి ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. ఆ తర్వాత కథను ఊహించలేరు’’ అని తెలిపారు అనిల్ విశ్వనాథ్. ‘‘మా నాన్నగారు క్యారెక్టర్ ఆర్టిస్ట్.
ఇలాంటి పెద్ద వేదికలపై మాట్లాడాలని ఆయన కోరిక. కానీ 2014లో చనిపోయారు. నేను దర్శకుణ్ణి కావడానికి 15 ఏళ్లు పట్టింది. మా నాన్న ఎక్కడున్నా చూస్తారని నమ్ముతున్నా. ఓ మంచి సినిమా చూశామన్న ఫీల్‌ని ‘12ఏ రైల్వే కాలనీ’ కలిగిస్తుంది’’ అని చెప్పారు నాని.


