శైలేష్ కొలను, సందీప్ కిషన్, బాబీ, కార్తీ, కృతీశెట్టి
‘‘యంగ్ హీరోలు ఇలాంటి వైవిధ్యమైన సినిమాలు చేయాలని కోరుకునే మూడు సినిమాల్లో తప్పకుండా ఒకటి కార్తీ అన్నది ఉంటుంది. ఆయన్ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నప్పుడు.. నన్ను తమిళ ప్రేక్షకులు ఇష్టపడరా? అనే నమ్మకంతోనే కోలీవుడ్ వెళ్లాను. అక్కడ నాకు ప్రతిసారీ తన సపోర్ట్ అందిస్తుంటారు కార్తీ అన్న. ఆయన చేసిన ‘అన్నగారు వస్తారు’ సినిమా విజయం సాధించాలి’’ అని హీరో సందీప్ కిషన్ తెలిపారు. కార్తీ హీరోగా, కృతీశెట్టి హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘అన్నగారు వస్తారు’. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 12న తెలుగులో విడుదలవుతోంది.
హైదరాబాద్‌లో నిర్వహించిన ‘అన్నగారు వస్తారు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డైరెక్టర్స్ బాబీ(కేఎస్ రవీంద్ర), వెంకీ కుడుముల, శివ నిర్వాణ, దేవ కట్టా, వివేక్ ఆత్రేయ, రాహుల్ రవీంద్రన్, శైలేష్ కొలను, దర్శక–నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి అతిథులుగా హాజరై, ‘అన్నగారు వస్తారు’ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. నిర్మాత ‘బన్నీ’ వాస్ మాట్లాడుతూ–‘‘సూర్య, జ్ఞానవేల్ రాజాగార్లతో మాకు మంచి అనుబంధం ఉంది. కార్తీగారి మీద ఉన్న అభిమానం వల్లే ఈ వేడుకకి ఇంతమంది యంగ్ డైరెక్టర్స్ వచ్చారు. ‘అన్నగారు వస్తారు’ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని చెప్పారు.
‘‘ఈ సినిమాను మా సంస్థ ద్వారా రిలీజ్ చేస్తుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు మైత్రీ డిస్ట్రిబ్యూషన్ శశిధర్. ‘‘తమిళంలో నా తొలి చిత్రంతోనే కార్తీగారితో కలిసి నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది’’ అని కృతీశెట్టి పేర్కొన్నారు. కార్తీ మాట్లాడుతూ–‘‘ఎన్టీఆర్, ఎంజీఆర్‌గార్లు సినిమాను, రాజకీయాలను, ప్రజా జీవితాలను మార్చేశారు. వారు మనకు సూపర్ హీరోస్. అలాంటి వాళ్లు మళ్లీ ఇప్పుడు తిరిగొస్తే ఎలా ఉంటుంది? అనేది ‘అన్నగారు వస్తారు’ సినిమా కథ’’ అన్నారు.


