● లోగో బ్రాండింగ్ ఏర్పాటు చేయిస్తాం
● టూరిజం అభివృద్ధి కమిటీ సమావేశంలో కలెక్టర్
మెదక్ కలెక్టరేట్: జిల్లా హెరిటేజ్ టూరిజం కీర్తిని నలుదిక్కులా చాటేలా లోగో బ్రాండింగ్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో మొదటి విడత టూరిజం అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వదేశీ దర్శన్‌లో భాగంగా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలోని ఏడుపాయల ఆవరణలో రూ.7 కోట్లతో 12 కాటేజీలు నిర్మించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందుకోసం టూరిజం శాఖ ద్వారా స్థల సేకరణ పూర్తి చేసి నిర్మాణ బాధ్యతలను టూరిజం, జిల్లా పంచాయతీ శాఖకు అప్పగించేలా కార్యాచరణ చేస్తున్నామన్నారు. మెదక్ ఖిల్లా వీక్షణకు యాత్రికులకు పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.5 టికెట్ ధర నిర్ణయించామన్నారు. స్వదేశీ దర్శన్‌లో భాగంగా మెదక్ ఖిల్లా, పోచారం ఈ రెండు కూడా ఇటీవల కేంద్ర బృందం సందర్శించిందన్నారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అలాగే సీఎస్ సంజయ్ జాజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అంతకుముందు మెదక్ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ జోజి, టూరిజం అధికారి రమేశ్, డీఆర్డీఓ శ్రీనివాసరావుతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.


