‘పాపన్నపేట మండల కేంద్రంలో ఓ మహిళ తన కూతురు పెళ్లి కోసం సీ్త్రనిధి రుణం తీసుకోవాలని అనుకుంది. తమ వీఓఏ పరిధిలో 30 గ్రూపులు ఉండగా, 29 గ్రూపుల సభ్యులు మొత్తం రుణాలు కట్టేశారు. ఒక్క గ్రూపు మాత్రమే రూ.37,254 బకాయి ఉంది. ఫలితంగా ఆ గ్రూపు ఎన్‌పీఏ పరిధిలోకి వెళ్లింది. దీంతో వీఓ పరిధిలో మొత్తం గ్రూపులకు రుణం రాని పరిస్థితి నెలకొంది.’
పాపన్నపేట(మెదక్): గ్రామీణ మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి, స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో 1982లో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 15,110 డ్వాక్రా, 530 గ్రామ సంఘాలు ఉన్నాయి. చాలా మంది మహిళలు బ్యాంకు లింకేజీలతో రుణాలు పొంది, చిన్న చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి పథకాలతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. దీనికి తోడు సీ్త్రనిధి, పొదుపు సొమ్ము సహాయంతో తక్షణ ఆర్థిక సహాయం పొందవచ్చు. అయితే ఈ రుణాల్లో కొన్ని ప్రాంతాల్లో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. గతంలో పాపన్నపేట మండలం పొడిచన్‌పల్లిలో బ్యాంకు, ఐకేపీ, వీఓఏలు కలిసి రుణాలు పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి. ఈ గోల్‌మాల్ వ్యవహారంలో ఒక సీసీ సస్పెన్షన్‌కు గురికాగా, చివరకు వీఓఏ ఆత్మహత్య చేసుకుంది.
ఇచ్చింది రూ.16.50 కోట్లు!
జిల్లాలో రుణాల వసూళ్లలో అక్కడక్కడా చోటు చేసుకుంటున్న అక్రమాల దృష్ట్యా నిబంధనలు కఠినతరం చేశారు. ఒక వీఏఓ పరిధిలో 75 శాతం రికవరీ ఉంటేనే రుణాలు ఇస్తున్నారు. జిల్లాలో 6427 గ్రూపులకు సంబంధించి రూ.150.46 కోట్లు బకాయిలు ఉన్నాయి. కాగా మొండి బకాయిల కింద 829 గ్రూపులు ఉండగా, రూ.25 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఈఏడాది రూ.74.90 కోట్ల రుణాలు టార్గెట్ ఉండగా, ఇప్పటివరకు కేవలం రూ.16.50 కోట్లు మాత్రమే ఇచ్చారు. 5 నెలల కాలంలో 21 శాతం రుణాలు మాత్రమే ఇవ్వడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శణమనే ఆరోపణలున్నాయి.
75 శాతం రికవరీ ఉంటేనే మంజూరు
బకాయి పడిన 829 గ్రూపులు
రావాల్సిన సొమ్ము రూ.25 కోట్లు
జిల్లాలో 15,110 గ్రూపులు


