● మల్లన్నసాగర్ ఉద్యమం కళ్లెదుట కదలాడుతోంది ● ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ ● ‘కన్నీళ్ల సాగరం’ పుస్తకావిష్కరణ
గజ్వేల్: మల్లన్నసాగర్ ఉద్యమం ఇంకా కళ్లెదుట కదులుతోందని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వాసితుల పట్ల వ్యవహరించిన తీరు మరిచిపోలేనని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యలపై ఉపాధ్యాయుడు పులి రాజు, సీనియర్ జర్నలిస్ట్ రాజేందర్‌రెడ్డిలు సంయుక్తంగా రచించిన ‘కన్నీళ్ల సాగరం’ పుస్తకాన్ని బుధవారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నిర్వాసిత కాలనీలో ఆవిష్కరించారు. చేసిన గోరంత పనిని కొండంత చేసి 14గ్రామాలకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల పక్షాన కొట్లాడితే తనను రెండుసార్లు అరెస్ట్ చేసి జైలుకు పంపారని గుర్తు చేశారు. నిర్వాసితుల పెండింగ్ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిర్వాసితుల సమస్యలను తమ పుస్తకంలో రచయితలు కళ్లకు కట్టినట్లు వివరించారని కొనియాడారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సజయ మాట్లాడుతూ 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు. ప్రశ్నించేతత్వం అలవాటుచేసుకున్నప్పుడే న్యాయం జరుగుతుందన్నారు. ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న మాట్లాడుతూ మల్లన్నసాగర్ నిర్వాసితుల గోసలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలుసునని చెప్పారు. బాధితుల పక్షాన తన పాట ద్వారా పోరాటం చేస్తానన్నారు. అవసరమైతే సీఎం కలిసి సమస్యలను వివరిస్తానని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్, మున్సిపల్ కౌన్సిలర్‌లు విష్ణువర్ధన్‌రెడ్డి, వెల్దెండి నర్సింహ్మారెడ్డి, ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


