నామినేటెడ్
● పదవుల భర్తీకి పీసీసీ సమాయత్తం
● వచ్చే నెల 5 లోగా ప్రతిపాదనలుఇవ్వాలని ఇన్‌చార్జిలకు ఆదేశాలు
● మెదక్ పీఏసీ సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చ
అధికార కాంగ్రెస్‌లో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న నాయకులకు, ఇతర పార్టీల నుంచి కొత్తగా చేరిన నాయకుల మద్య అంతర్గత పోరు రగులుతోంది. పార్టీ అధికారంలోకి రాగానే హస్తం గూటికి చేరిన నాయకులు ఆయా నియోజకవర్గాల్లో ఆదిపత్యం చెలాయిస్తుండటం సీనియర్ నాయకులకు ఏమాత్రం మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంది. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి
నామినేటెడ్ పదవుల భర్తీ ప్రధాన ఎజెండాగా ఇటీవల మెదక్ పట్టణంలో ఉమ్మడి జిల్లా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరిగిన విషయం విధితమే. పార్టీ కోసం కష్టించి పనిచేసిన ప్రతి కార్యకర్తకు నామినేటెడ్ పదవులు వస్తాయని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ భరోసా ఇచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో ఖాళీగా ఉన్న మార్కెట్, ఆలయ కమిటీలు, సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్ పోస్టులు ఇలా.. నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలనే ప్రతిపాదనలు పంపాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలకు ఆదేశాలందాయి. సెప్టెంబర్ 5లోపు ఈ ప్రతిపాదనలు డీసీసీ అధ్యక్షుల ద్వారా ప్రతిపాదనలు రావాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ పదవులు ఎవరికి దక్కుతాయనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఈ పదవుల నియామకాల్లో పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత దక్కుతుందా..? లేదా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కండువా కప్పుకుని ఆయా నియోజకవర్గాల్లో కీలకంగా మారిన వలస నేతలకు దక్కుతాయా..? అనేది అంతర్గతంగా చర్చ జరుగుతోంది.
రెండు, మూడు చోట్ల మినహా..
● ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు, మూడు చోట్ల మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతల మధ్య అంతర్గతంగా కిరికిరి కొనసాగుతోంది.
● సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో కొత్త, పాత నాయకులకు పదవుల పంచాయతీ ఏకంగా గాంధీభవన్‌కు చేరిన విషయం విధితమే. బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన నాయకుడికి పార్టీ మండలాధ్యక్ష పదవిని ఎలా ఇస్తారని మూడు నెలల క్రితం పాత నాయకులంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏకంగా గాంధీభవన్‌ను ముట్టడించారు. ఈ నియామకాన్ని పరిశీలిస్తామని పీసీసీ నాయకత్వం సముదాయించి పంపింది. దీంతో ఇక్కడ కొత్త, పాత నేతలు తామే పార్టీ మండలాధ్యక్షున్ని అంటే., నేనే మండలాధ్యక్షున్ని అని ఇద్దరు చెప్పుకుంటున్నారు. ఇలాంటి పంచాయతీ ఉన్న ఈ నియోజకవర్గంలో ఇప్పుడు సహకార సంఘాల చైర్మన్, డైరెక్టర్లు, ఇతర నామినేటెడ్ పదవులు ఎవరిని వరిస్తాయనేంది ఆసక్తి నెలకొంది.
● మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. పాత, కొత్త నాయకుల మధ్య కిరికిరి కారణంగా కొన్ని మండల పార్టీ అధ్యక్షుల నియామకాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. శివ్వంపేట మండల పార్టీ అధ్యక్ష పదవితో పాటు, మండల కమిటీ పదవులు కొత్తగా పార్టీలో చేరిన వారికి ఇవ్వొద్దని.. పాత నాయకులంతా పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కమిటీ నియామకాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇలాంటి మండలాల్లో ఇప్పుడు నామినేటెడ్ పదవులు పాత వారికి దక్కుతాయా? కొత్త నేతలను వరిస్తాయనేది వేచి చూడాల్సిందే.


