పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సామ్యనాయక్
కౌడిపల్లి(నర్సాపూర్): సీపీఎస్ విధానం రద్దుచేసి ఓపీఎస్ అమలు చేయాలని పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సామ్యనాయక్ డిమాండ్ చేశారు. మండలంలోని కౌడిపల్లి, రాయిలాపూర్, తునికి, ముట్రాజ్‌పల్లి, వెల్మకన్న, కన్నారం ఉన్నత పాఠశాలలో మంగళవారం పీఆర్‌టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సెప్టెంబర్1, 2026నాటికి సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలన్నారు. దీంతోపాటు పీఆర్‌సీ నివేదిక తెప్పించుకుని మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే సెప్టెంబర్ 1న మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండలశాఖ అధ్యక్ష, కార్యదర్శులు రమేశ్, పరికి రమేశ్, చంద్రశేఖర్, నవాజ్, మహేందర్, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
భారత్ స్కౌట్ అండ్ గైడ్స్
జిల్లా సెక్రటరీ రాజేందర్
చిలప్‌చెడ్(నర్సాపూర్): విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ ముఖ్య ఉద్దేశమని భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ జిల్లా సెక్రటరీ రాజేందర్ పేర్కొన్నారు. మండల పరిధిలోని చిట్కుల్ కేజీబీవీలో విద్యార్థులకు భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో రాత పరీక్షలు, ప్రాక్టికల్స్ నిర్వహించి, వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ రాములు, ఉప సర్పంచ్ అఖిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రత్యేకాధికారి అంజలి మాట్లాడుతూ...ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో క్రమశిక్షణతోపాటు, శారీరక, మానసిక ధృఢత్వం కలగడంతోపాటు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండటంతోపాటు, తోటి వారికి సైతం తోడ్పాటు అందిస్తారన్నారు. కార్యక్రమంలో స్కౌట్ అండ్ గైడ్స్ మాస్టర్ నాగరాజు, పాఠశాల గైడ్ కెప్టెన్ శారద, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
రామాయంపేట(మెదక్): రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందజేయాలని మెదక్ ఆర్డీవో రమాదేవి స్పష్టం చేశారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిని మంగళవారం రమాదేవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. సోమవారం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాడల్ స్కూల్ విద్యార్థులు పరిస్థితిని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లింబాద్రిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్గార్ రజని, ఆర్‌ఐలు, ఇతర సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
హత్నూర(సంగారెడ్డి): హత్నూర మండల కేంద్రంలో రెండు రోజులుగా నెట్‌వర్క్ అంతరాయం ఏర్పడటంతో తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలో నెట్వర్క్ సమస్య తలెత్తడంతో ఎయిర్‌టెల్ నిర్వాహకులపై స్థానికులు మండిపడుతున్నారు. ఇక తహసీల్దార్ కార్యాలయంలో ఇంటర్నెట్ సమస్యలేర్పడి రిజిస్ట్రేషన్లు ఇతర పనుల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.


