ముందస్తు కార్యాచరణతో ముందుకెళ్దాం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడనున్న ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక అమలుపై సోమవారం సంగారెడ్డి జెడ్పీ హాలులో సమీక్ష సమావేశం జరిగింది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలపై లో తుగా చర్చించారు. వ్యవసాయం, తాగునీరు, పశుగ్రాసం, విద్యుత్ వంటి అంశాలకు సంబంధించిన ప్రణాళికలను ఆయాశాఖల అధికారులు వివరించారు. ఈసందర్భంగా తెలంగాణ జలసిరి పోస్టర్‌ను, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక నివేదికను మంత్రులు, ఎమ్మెల్యేలు ఆవిష్కరించారు. స్పెషల్ సెక్రటరీ వాణిప్రసాద్, కలెక్టర్లు ప్రతీక్‌జైన్, ప్రతిమాసింగ్, ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, సంజీవరెడ్డి, సునీతారెడ్డి, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆయకట్టు రైతులను ఆదుకోవాలి
సింగూరుకు దిగువన ఉన్న ఘనపురం ఆనకట్ట ఆయకట్టు రైతులను ఆదుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు సమావేశం దృష్టికి తెచ్చారు. సింగూరు నుంచి నీటి విడుదలకు వీలు లేకుండా పోవడంతో వారికి సబ్సిడీ విత్తనాలు, ఇన్‌పుట్ సబ్సిడీ ఆర్థిక సాయం అందించాలన్నారు. వీలైనంత త్వరగా సింగూరు మరమ్మతులు పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.
కోతులకు కూ.ని. ఆపరేషన్ కేంద్రాలు
కోతుల బెడద కారణంగా చాలా గ్రామాల్లో వరి తప్ప, కూరగాయలు వంటి ఆరుతడి పంటలు సాగు చేసే పరిస్థితి లేదు. కోతుల సంతానాన్ని తగ్గించేందుకు ఆపరేషన్లు చేసే కేంద్రాలను ఏర్పాటు చేయాలని పలువురు ఎమ్మెల్యేలు సమావేశం దృష్టికి తెచ్చారు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.10 లక్షల వరకు అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపాలని మంత్రి వివేక్ కలెక్టర్లను ఆదేశించారు.
అధికారుల మధ్య సమన్వయం అవసరం
‘అమృత్’ పనులపై ఆసక్తికర చర్చ
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ప్రత్యామ్నాయంపై సమీక్ష
సమన్వయంతో పనిచేయాలి
తాగునీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలి. సింగూరు నీటిని ఉమ్మడి జిల్లా తాగునీటి అవసరాలకే వినియోగించాలి. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులకు వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పించాలి. మున్సిపాలిటీలు, గ్రామాల్లో తాగునీటి అవసరాలకు ప్రత్యామ్నాయంగా ముందస్తు ప్రణాళికను అమలు చేయాలి. పీఎం సూర్యఘర్ వంటి పథకాల లబ్ధి సామాన్యులకు అందేలా చర్యలు చేపట్టాలి. – అంజిరెడ్డి, ఎమ్మెల్సీ


