హవేళిఘణాపూర్(మెదక్): మెదక్ జిల్లా సరిహద్దు పోచారం అభయారణ్యంలో వన్యప్రాణులను తిలకించేందుకు ఫారెస్టు అధికారులు కొత్త సఫారీ వాహనం మంజూరు చేశారు. పాత వాహనంతో కొన్ని ఇబ్బందులు కాగా, సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు నూతన హంగులతో కూడిన సఫారీ వాహనం పంపించారు. ఇందులో 10 మంది పర్యాటకులు ప్రయాణించడంతో పాటు వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా తయారు చేశారు. గతంలో పర్యాటకులు వచ్చిన సమయంలో పాత వాహనంలో అభయారణ్యంలోకి వెళ్లేందుకు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. దీంతో తమ సొంత వాహనంలో ఫారెస్ట్ సిబ్బందిని తీసుకెళ్లి చూపించేవారు. నూతన సఫారీ ద్వారా హాయిగా అభయారణ్యంలో ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. ఇదే విషయమై ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భీమ్‌రెడ్డి మాట్లాడుతూ.. దీనిని సందర్శకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెద్దవారికి రూ.100, చిన్నపిల్లలకు రూ.50 చెల్లించి పర్యటించవచ్చని తెలిపారు.


