సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి, మెదక్ జిల్లాల వాసులకు తాగునీటి కష్టాలు పొంచి ఉన్నాయి. సింగూరు డ్యాం మరమ్మతుల నేపథ్యంలో ప్రస్తుతం జలాశయంలో ఉన్న నీటి మట్టం కేవలం 45 రోజులకు మాత్రమే సరిపోతాయని మిషన్ భగీరథ అధికారులు తేల్చి చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురియక.. మంజీరా నదికి వరద నీరు రాకపోతే ఈ రెండు జిల్లాల్లోని 316 గ్రామాలు, నివాసిత ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేయలేమని స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లాలో 275, మెదక్ జిల్లాలో 41 గ్రామాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందేనని అన్నారు. సోమవారం జెడ్పీ సమావేశం హాల్‌లో జరిగిన సమీక్షలో మిషన్ భగీరథ ఉమ్మడి జిల్లా పర్యవేక్ష ఇంజనీర్ రఘువీర్ ప్రకటించారు.
3 టీఎంసీల కంటే తగ్గితే పంపింగ్ కష్టమే..
సింగూరు ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో 4.29 టీఎంసీల మేరకు మాత్రమే నీరుంది. ఈ జలాశయం నీటి నిల్వ కనీసం మూడు టీఎంసీల కంటే తగ్గితే అక్కడి నుంచి నీటిని పంపింగ్ చేయడం వీలు కాదు. దీంతో ఉన్న ఒక టీఎంసీ కేవలం నెల రోజులకే సరిపోతాయని, గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొంత మేరకు ప్రాజెక్టులోకి నీళ్లు రావడంతో మరో పక్షం రోజులు అదనంగా సరఫరా చేయడానికి వీలు పడుతుందని ఎస్‌ఈ వివరించారు. ఈ పరిస్థితి ఎదురైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆశాఖ అధికారులు ప్రకటించారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. అవసరమైతే ఆయా గ్రామాల్లో ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకోవడం, పాడైపోయిన బోర్లను మరమ్మతులు చేయడం, లోతు తక్కువగా ఉన్న బోర్లను మరింత లోతుకు తవ్వడం వంటి చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. రూ.40 కోట్ల అంచనా వ్యయంతో ఈప్రణాళికను తయారు చేస్తున్నారు.
అప్పటిలోగా మంజీరాకు వరదరాకపోతే నీరు ఇవ్వలేం
తేల్చి చెప్పిన మిషన్ భగీరథ అధికారులు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటన
మున్సిపాలిటీల్లో సైతం..
రెండు జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీల్లో ఇప్పటికే పలు కాలనీలకు తాగునీటి సరఫరా కష్టాలు షురువయ్యాయి. సదాశివపేట పట్టణంలో రెండు, మూడు వార్డులకు రెండు రోజులకోసారి నీటి సరఫరా అవుతోంది. అలాగే సంగారెడ్డి మున్సిపాలిటీలో పాత బస్టాండ్ ప్రాంతంలో తాగునీటి సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. జహీరాబాద్, కోహీర్, మెదక్, రామాయంపేట తదితర పట్టణ వాసుల అవసరాలకు, ప్రస్తుతం జరుగుతున్న నీటి సరఫరాకు వ్యత్యాసం ఉంటోంది. ఇప్పుడు సింగూరు ప్రాజెక్టుకు వరద నీరు రాకపోతే మూడు వందలకు పైగా గ్రామాల వాసులకు తాగునీటి కష్టాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.


