న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2026
ఏడుపాయల్లో భూ ‘మాయ’ం
● మంజీరా పరీవాహ క ప్రాంతం ఆక్రమణ
● అనుమతి లేకుండానే 7 ఎకరాల్లో రిసార్ట్ నిర్మాణ ర
● కళ్లప్పగించి చూస్తున్న అధికారులు
మెదక్‌జోన్: జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం పరిధి పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లికి ఒకవైపు ఉండగా, మరోవైపు కొల్చా రం మండలం పోతన్‌శెట్టిపల్లిలో కొంత భాగం ఉంది. పోతన్‌శెట్టిపల్లి వైపు జాతీయ రహదారి (265–డీ) ఉండటంతో భక్తులు పెద్దఎత్తున ఇక్కడి నుంచి వస్తుంటారు. ఈక్రమంలో మంజీరా నదిపై నిర్మించిన మొదటి బ్రిడ్జి సమీపంలో కొందరు వ్యక్తులు (257/అ, 257/ఆ) సర్వే నంబర్లలో 7 ఎకరాల వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని భారీ రిసార్ట్ నిర్మిస్తున్నారు. ఏకంగా బఫర్‌జోన్‌లోనే రోడ్డు వేసి, భారీ సిమెంట్ నీటి ట్యాంక్ నిర్మించి పనులు చేపడుతున్నారు.
హైడ్రా అవసరం
ఏడుపాయల పుణ్యక్షేత్రం వద్ద ఎప్పుడు చూసినా ఇసుకేస్తే రాలనంత భక్తులు వస్తుంటారు. మహాశివరాత్రి, మాఘ అమావాస్య, ఉగాది పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రభుత్వం ఏటా జాతర ఉత్సవాలకు రూ. 2 కోట్లు మంజూరు చేస్తోంది. ఇటీవల 12 కాటేజీల నిర్మాణాలకు రూ. 7 కోట్లను స్థానిక ఎమ్మెల్యే రోహిత్‌రావు మంజూరు చేయించారు. ఆలయానికి తెలంగాణ, ఏపీ, మహా రాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా వస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పుణ్యక్షేత్రం వద్ద, మంజీరా నది పక్కన బఫర్‌జోన్‌లో నిర్మాణాలు చేపడుతుంటే అధికార యంత్రాంగం కళ్లప్పగించి చూస్తున్నారు తప్ప అడ్డుకోలేకపోతున్నారు. ఇక్కడి అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా ఇక్కడికి కావాలని పలువురు కోరుతున్నారు.
అనుమతి లేకుండానే..
వ్యవసాయ భూముల్లో నిర్మాణాలు చేపట్టాలంటే నిబంధనల ప్రకారం నాలా కన్వర్షన్‌తో పాటు, సంబంధిత పంచాయతీ నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండానే పెద్ద ఎత్తున రిసార్ట్ నిర్మిస్తున్నారు. అందులో వాటర్ ఫౌంటేన్, కాటేజీల నిర్మాణాలు సాగుతున్నాయి. గతేడాది మాదిరిగా మళ్లీ వర్షాలు కురిస్తే ప్రస్తుతం బఫర్‌జోన్‌లో నిర్మిస్తున్న రోడ్డు, నీటి కుండీలు కొట్టుకపోవటం ఖాయమని పలువురు పేర్కొంటున్నారు. అంతే కాకుండా ప్రాణాపాయం జరిగే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
బఫర్‌జోన్‌లో నిర్మించిన నీటి ట్యాంక్
చర్యలు తీసుకుంటాం
ఏడుపాయల్లోని పోతంశెట్టిపల్లి శివారులో నూతనంగా నిర్మిస్తున్న రిసార్ట్‌ను కొంతభాగం బఫర్‌జోన్‌లో నిర్మించారు. మంజీరా నది అంచున రోడ్డు వేసి నీటి ట్యాంకును నిర్మించారు. వాటిని తొలగించాలని సదరు వ్యక్తులకు నోటీసులు ఇచ్చాం. తొలగించకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
– స్వాతి, డీఈ ఇరిగేషన్, కౌడిపల్లి


