
లోటును మించి..!
మారిన జిల్లా వర్షపాత ముఖచిత్రం
మూడు మండలాల్లో అత్యధికం
మూడు రోజులుగా జిల్లాలో సాధారణం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకు మూడు మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఈనెలలో రామాయంపేట మండలంలో 42 మి.మీ వర్షం కురిసింది. చేగుంటలో 28 మి.మీ, నర్సాపూర్‌లో 20 మి.మీ మేర అత్యధిక వర్షపాతం నమోదైంది. కాగా జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది అన్నిరకాల పంటలు 3.50 లక్షల ఎకరాలు సాగు కావాల్సి ఉండగా, ఇప్పటికే ఆరుతడి పంటలు 50 వేల ఎకరాల్లో సాగయ్యాయి. వరి 3 లక్షల ఎకరాల మేర సాగు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 2.43 లక్షల ఎకరాలు సాగైనట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఇంకా 57 వేల ఎకరాలు సాగులోకి రావాల్సి ఉంది.
జిల్లా వర్షపాత వివరాలు మి.మీలో..
నెల వర్షపాతం నమోదు
కావాల్సింది
జూన్ 81.7 112.4
జూలై 119.4 206.6
ఆగస్టు 400.7 387.7
(ఇప్పటివరకు)
మెదక్‌జోన్: మెతుకుసీమను వర్షాలు మురిపించాయి. నిన్నటి వరకు లోటు వర్షపాతంలో ఉండగా, ఒక్కసారిగా సాధారణానికి మించి నమోదైంది. సాగుకు మరో వారం రోజుల గడువు మాత్రమే ఉండటంతో రైతులు ముమ్మరంగా నాట్లు వేస్తున్నారు. ఈసారి సాధారణ సాగు అవుతుందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లావాప్తంగా జూన్‌లో 112.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 81.7 మి.మీ వర్షం కురిసింది. ఈ లెక్కన 30.7 మి.మీ తక్కువగా నమోదైంది. జూలైలో 206.6 మి.మీ కురవాల్సి ఉండగా, 119.4 మి.మీ నమోదైంది. ఈ లెక్కన 87.2 మి.మీ తక్కువగా నమోదైంది. గడిచిన జూన్, జూలైలో మొత్తంగా 319 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా, 201.1 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. 117.9 మి.మీ తక్కువగా నమోదైంది.
ఈనెలలోనే ప్లస్..
గడిచిన రెండు నెలల్లో మైనస్ వర్షపాతం నమోదు కాగా, ఈనెలలో గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోటు నుంచి ప్లస్‌కు చేరుకుంది. ఈనెల 10వ తేదీ వరకు 387.7 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా, ఇప్పటివరకు 400.7 మి.మీ వర్షం నమోదు అయింది. ఈ లెక్కన 13 మి.మీ ఎక్కువగా కురిసిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ మూడు రోజుల్లోనే జిల్లాలో 46.8 మి.మీ వర్షం కురిసింది. ఈనెలలో ఇప్పటివరకు 10.6 మి.మీ వర్షం కురవాల్సి ఉంది. ఈలెక్కన 36.2 మి.మీ అధికంగా నమోదైందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.