
ఇంకుడు గుంతలు మరిచారు
ఆసక్తి చూపని పట్టణ ప్రజలు
● పట్టించుకోని అధికారులు
● పేట మున్సిపాలిటీలో దుస్థితి
రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 5,500 వరకు నివాస గృహాలున్నాయి. గతంలో నిర్మించిన, కొత్తగా నిర్మిస్తున్న గృహాల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వంద రోజుల ప్రణాళికలో సైతం ఈ అంశాన్ని చేర్చింది. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించుకునేలా చర్యలు తీసుకో వాలని రాష్ట్ర పురపాలికశాఖ ఆదేశించింది. పట్టణంలో పెద్ద ఎత్తున గృహాల నిర్మాణ పనులు కొనసాగుతున్నా.. ఏ ఇంటి వద్ద ఇంకుడు గుంత కనబడటం లేదు. వుున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో అధికారులు సర్వే నిర్వహించి ఇంకుడు గుంతలు లేని నివాసాలను గుర్తించి నమోదు చేసుకున్నారు. వాటిని నిర్మించుకోని వారికి నోటీసులు ఇవ్వాలని అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు కాగితాలకే పరిమితం అయ్యాయి. ఇంకుడు గుంత తప్పనిసరని, ఇంటి నిర్మాణానికి ముందు ఇచ్చే అనుమతిలో నమోదు చేసి ఉన్నా, ఎవరూ పట్టించుకోడం లేదు. గుంత నిర్మించుకోకపోతే నల్లా కనెక్షన్ తొలగించాలని ఉత్తర్వులో స్పష్టం చేశారు.
వృథా అవుతున్న వర్షం నీరు
వరుణుడు కరుణించినా.. వాన చుక్క భూమిలోకి ఇంకే పరిస్థితి కనిపించడం లేదు. భారీ వర్షాలు కురిసినా.. వేసవిలో సాగు, తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. వర్షం నీటిని భూగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన ఇంకుడు గుంతలు తగినన్నీ లేకపోవడంతో భూగర్భ జలమట్టాలు ఆశించిన మేర పెరగడం లేదని భూగర్భ జల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విధిగా నిర్మించుకోవాలి
ప్రతి ఇంటి వద్ద విధిగా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి. ఇందుకు కేవలం రూ. నాలుగు వేల లోపే ఖర్చవుతుంది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేసింది. వీటితో ఎన్నో లాభాలున్నాయి. భవిష్యత్తులో నీటి ఎద్దడి సమస్య తలెత్తదు.
– దేవరాజ్, టీపీఓ,
రామాయంపేట మున్సిపాలిటీ
ఉపయోగాలు..
ఇంకుడు గుంతలతో భూమిలో నీటి మట్టం పెరుగుతుంది.
ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది.
వర్షం నీరు ఇంకుడు గుంతల్లోకి మళ్లిస్తే రోడ్డుపై వరద నిలువదు.
కాలుష్య నివారణతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతాయి.
గుంతల్లో నీరు నిల్వ లేకుంటే దోమల బెడదను అరికట్టవచ్చు.
ఇంటికో ఇంకుడు గుంత నినాదం ఆచరణలో చతికిలపడింది. ప్రతి ఇంటి వద్ద విధిగా నిర్మించుకోవాలనే ఆదేశాలు బేఖాతరవుతున్నాయి. వాన నీటిని ఒడిసి పట్టి భూమి లోపలికి పంపి భూగర్భజలాలు పెంపొందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుండగా, అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారే ఆరోపణలు ఉన్నాయి. – రామాయంపేట
(మెదక్)

ఇంకుడు గుంతలు మరిచారు