
తైబజార్.. జులుం
మెదక్‌జోన్: మెదక్ మున్సిపాలిటీ పరిధిలో కూరగాయల మార్కెట్ కొనసాగుతోంది. ఇటీవల తైబజార్‌ను మున్సిపల్ అధికారులు 8 నెలల కోసం వేలం వేయటంతో ఓ వ్యక్తి సుమారు రూ. 8 లక్షల పైచిలుకు టెండర్ పాడి దక్కించుకున్నాడు. ఈ మార్కెట్‌లో నిత్యం వందలాది మంది రైతులు, చిరు వ్యాపారులు కూరగాయలు విక్రయిస్తారు. వీరితో పాటు మార్కెట్‌కు వచ్చే లారీలు, కూరగాయల లోడ్లతో పాటు ఇతర సామగ్రి వచ్చినా తైబజార్ నిర్వాహకులు వసూళ్లు చేస్తున్నారు. కాగా దేనికెంత వసూలు చేయాలనే బోర్డులు మార్కెట్‌లో ఎక్కడా కనిపించడం లేదు. రైతుల నుంచి రూ. 20 నుంచి రూ. 30 వరకు వసూలు చేయాల్సి ఉండగా, అంతకు మించి వసూలు చేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
అర్ధంతరంగా ఆగిన రైతు బజార్ నిర్మాణం
రైతుబజార్ నిర్మాణం ఎప్పుడో..?
రైతులు పండించిన ఉత్పత్తులు నేరుగా విక్రయించుకునేందుకు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 2017లో మెదక్ కూరగాయల మార్కెట్ సమీపంలో రైతుబజార్ నిర్మాణం చేపట్టారు. 48 షాపుల విస్తీర్ణంతో చేపట్టిన భవన నిర్మాణానికి రెండు విడతల్లో ఇప్పటివరకు రూ. 6.86 కోట్లు విడుదలయ్యాయి. అయితే ఆ నిధులతో పూర్తిస్థాయిలో నిర్మాణం కాలేదు. మరుగుదొ డ్లు, లిఫ్ట్, విద్యుత్ సౌకర్యంతో పాటు తదితర వాటి కోసం మరో రూ. 1.30 కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇది పూర్తయితే 200 మంది రైతులు, చిరువ్యాపారులు పంట ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం ఉంది. కాగా రైతుబజార్ నిర్మాణం ప్రారంభమై 8 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇది పూర్తయితే రైతులు ఎలాంటి తైబజార్ చెల్లింపులు లేకుండా ఉచితంగా విక్రయించుకునే వీలు ఉంటుంది. మార్కె ట్‌కు జిల్లాలోని 8 మండలాల నుంచి రైతులు, కూరగాయలు తెస్తుంటారు. వారికి తోడు చిరు వ్యాపారులు సైతం స్థలం రోడ్లపైనే అమ్మకాలు చేస్తున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. వర్షం వస్తే అవస్థలు పడుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
నిబంధనల ప్రకారం మాత్రమే తైబజార్ వసూలు చేయాలి. దౌర్జన్యం చేస్తే చర్యలు తప్పవు. దేనికి ఎంత వసూలు చేయాలనే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించాం. త్వరలో ఏర్పాటు చేయిస్తాం.
– శ్రీనివాస్‌రెడ్డి, మెదక్ మున్సిపల్ కమిషనర్
మార్కెట్ నిర్వాహకుల రెట్టింపు వసూళ్లు
పట్టించుకోని అధికారులు
ఆందోళనలో రైతులు, చిరు వ్యాపారులు