
గంగమ్మ ఒడిలో దుర్గమ్మ
● పరవళ్లు తొక్కుతున్న మంజీరా
● సింగూరు ఇన్‌ఫ్లో 32,766 క్యూసెక్కులు
● అవుట్ ఫ్లో 43,634 క్యూసెక్కులు
● పెరిగిన పర్యాటకుల తాకిడి
పాపన్నపేట(మెదక్): దుర్గమ్మ ఆలయం నాలుగు రోజులుగా గంగమ్మ ఒడిలోనే కొనసాగుతోంది. ఆదివారం సింగూరు నుంచి విడుదల చేసిన నీటి ప్రవాహం పెరగడంతో, మంజీరా పరవళ్లు తొక్కుతూ ఘనపురం ఆనకట్టపై నుంచి పొంగిపొర్లుతోంది. ఏడుపాయల్లో జలకళ ఉట్టి పడుతుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టులోకి 32,766 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా, ఇరిగేషన్ అధికారులు 43,634 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు భద్రతపై డ్యాం సేఫ్టీ కమిటీ ఇచ్చిన సూచనల మేరకు 520.5 మీటర్ల నీటి మట్టాన్ని దృష్టిలో ఉంచుకొని, నీటిని విడుదల చేస్తున్నారు. ఏడుపాయల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ తన బలగాలతో అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు, రెవెన్యూ, ఇరిగేషన్ సిబ్బంది స్థానికంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రాజగోపురంలోని దుర్గామాత ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జలకళను ఆస్వాదిస్తూ సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు.

గంగమ్మ ఒడిలో దుర్గమ్మ

గంగమ్మ ఒడిలో దుర్గమ్మ