
రైతు బీమాకు 7,100 మంది
మెదక్ కలెక్టరేట్: అన్నదాత అకాల మృత్యువాత పడితే ఆ కుటుంబం రోడ్డున పడకూడదని గత ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో ఎంతో మంది రైతు కుటుంబాలను ఆదుకుంది. అయితే గతంలో రైతుబీమా నమోదు చేసుకోని వారే కాకుండా, ఇటీవల కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన వారికి కూడా అవకాశం కల్పించింది. ఇందుకోసం ఈనెల 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలో ఇటీవల కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన 12,145 మంది రైతులు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. దీంతో వ్యవసాయ అధికారులు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించారు. దీంతో రైతులు సైతం ముందుకొచ్చారు. నిరాక్షరాస్యులైన రైతుల వివరాలు సేకరించి అధికారులే ఆన్‌లైన్ చేయించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 7,100 మంది రైతులు బీమాకు నమోదు చేసుకున్నారు. కాగా ఈ పథకానికి ప్రభుత్వమే రైతుల తరఫున ప్రీమియం చెల్లిస్తుంది. రైతు అకాల మృత్యువాత పడితే వారి నామినీ అకౌంట్‌లో రూ. 5 లక్షలు జమవుతాయి. అయితే కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన మరికొంత మంది రైతులు అందుబాటులో లేక నమోదు చేసుకోలేకపోయారు. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో ఉన్నవారు, ఇతరత్ర కారణాలతో కొంతమంది నమోదుకు ముందుకు రాలేదు. అయితే ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న ఆస్తి హత్యలకు భయపడి కొంతమంది నామినీ పెట్టడం ఇష్టం లేక నమోదు చేసుకోలేదని తెలిసింది. అత్యధికంగా పట్టణాల్లో నివసించేవారు, బడా రైతులు నమోదు చేసుకోనట్లు సమాచారం.

రైతు బీమాకు 7,100 మంది