
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అదనపు కలెక్టర్ నగేశ్
చిలప్‌చెడ్(నర్సాపూర్)/కొల్చారం: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. మండల పరిధిలోని చిట్కుల్ శివారులో పాత వంతెనపై పొంగిపొర్లుతున్న మంజీరా ప్రవాహాన్ని, బద్రియా తండాలో తెగిపోయిన పోతాన్‌కుంట కట్టను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన చర్యలు చేపట్టాలన్నారు. కురుస్తున్న వర్షాలకు కట్టలు తెగడం, చెరువులకు గండ్లు పడడంలాంటివి జరిగితే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్, తహసీల్దార్ సహదేవ్, ఎంపీడీఓ ప్రశాంత్, ఇరిగేషన్ ఏఈ హరీశ్‌రెడ్డి, ఎస్‌ఐ నర్సింహులు, అర్‌ఐ సునీల్‌సింగ్ తదితరులు ఉన్నారు. అలాగే కొల్చారం మండలంలోని సంగాయిపేట గ్రామ పెద్ద చెరువు అలుగును పరిశీలించారు. రైతులతో కలిసి గంగమ్మకు కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు.